Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆవేదన
- ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద టీటీసీ నిరాహార దీక్షకు మద్దతు
నవతెలంగాణ- అడిక్‌మెట్
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కరించకుండా ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యానికి కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ట్రూ టీచర్స్ కొయిలీషన్ (టీటీసీ) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన నిరాహార దీక్షకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. బడ్జెట్ కేటాయింపులు, బదిలీలు, ఉద్యోగోన్నతులు వంటి అంశాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రభుత్వ పాఠశాలల మీద తల్లిదండ్రులకు నమ్మకం పోయే ప్రమాదం ఉందన్నారు. ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించే ధర్నాలు, దీక్షలు కేవలం ఉపాధ్యాయుల కోసం కాదని, విద్యార్థుల సంక్షేమం కోసమేనని చెప్పారు. ప్రజల్లో నమ్మకం కలిగేలా ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. టీటీసీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరికంటి మల్లయ్య, రాష్ట్ర అధ్యక్షులు పాపగారి ఆశీర్వాదం మాట్లాడుతూ.. విద్యార్థి కేంద్రీకృతంగా పనిచేసే ఉపాధ్యాయ సంఘంగా ట్రూ టీచర్స్ కొయిలీషన్ ఏర్పడిందన్నారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాల ఏర్పాటు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం టీటీసీ పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ విద్యార్థులకు సరిపడా పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రయోజనాలు కలిగించే పథకాలకు కోట్లాది రూపాయలు వెచ్చించిస్తున్న పాలకులు..పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తు న్నారని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్క రించాలన్నారు. సర్వీస్ రూల్స్ రూపొందించి విద్యా శాఖను ముఖ్యమంత్రి సమీ క్షించాలని కోరారు. వెంటనే బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టాలన్నారు. 317 జీవో ద్వారా నష్టపోయిన వారికి న్యాయం చేయాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ దీక్షలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులేరి ప్రేమ్ సాగర్, ఉపాధ్యక్షులు కొమ్ము సునీల్, కార్తీక్, నాయకులు డాక్టర్ గాదె లింగస్వామి, తొంట కృష్ణ, శ్రీ విష్ణు, మోహన్, సయ్యద్ యూసుఫ్, మహమ్మద్ మోసిన్, బాలయ్య, యాదయ్య, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.