Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొన్న బాలింత..నేడు పసికందు మృతి
- వైద్యులే కారణమని బంధువుల ఆందోళన
- సమగ్ర విచారణ జరిపిస్తా : ఆస్పత్రి సూపరింటెండెంట్
నవతెలంగాణ -నల్లగొండ
వరుస ఘటనలతో నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల గత వారం బాలింత మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ఆందోళనలు, విచారణ కొనసాగుతుండగానే.. మరో విషాదం జరిగింది. మంగళవారం జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో నాలుగు రోజుల పసికందు చనిపోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే..
అనుముల మండలం భట్టువారిగూడెం గ్రామానికి చెందిన చింతకాయల సరిత రెండో కాన్పు కోసం ఈనెల 22న జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. 23న పురిటి నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతున్నా వైద్యులు సాధారణ ప్రసవం అవుందని నిర్లక్ష్యం వ్యవహరించారు. పరిస్థితి విషమించడంతో 24న ఆపరేషన్ చేసి బాబును తీశారు. అప్పటికే కడుపులో బాబు ఉమ్మనీరు తాగాడు.
దాంతో పుట్టిన మగ శిశువును మాత శిశు కేంద్రంలోని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కానీ, మంగళవారం తెల్లవారుజామున జ్వరం, ఫిట్స్ వచ్చి చనిపోయాడు. తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. టూటౌన్ ఎస్ఐ రాజశేఖరరెడ్డి సిబ్బందితో ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి శాంతింపజేశారు. పసికందు తండ్రి చింతకాయల సురేష్ మాట్లాడుతూ.. తన కొడుకు మృతికి కారకులైన వారిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మరోసారి పునరావృతం కావొద్దన్నారు. ఆస్పత్రికి రావాలంటేనే భయమేస్తుందని తెలిపారు.
వైద్యులపై చర్యలు తీసుకోవాలి : ఐద్వా
ఆస్పత్రిలో పసిపాప మృతిపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో మృతిచెందిన శిశువుని పరిశీలించి.. బంధువులను ఓదార్చారు.
సమగ్ర విచారణ జరిపిస్తా.. సూపరింటెండెంట్ లచ్చూనాయక్
బాలుడి మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తా. డాక్టర్ల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.ఉమ్మనీరు తాగడంతో ఆ నీరు ఊపిరితిత్తుల్లోకి చేరింది.దాంతో తీవ్రమైన జ్వరం, ఫిట్స్ రావడంతోనే బాలుడు మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు.