Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారితో ప్రేమగా మాట్లాడండి
- ఆర్ఎమ్, డీఎమ్లకు టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి విజ్ఞప్తి
- 650 మందికి ఉత్తమ అవార్డులు ప్రదానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందిని రీజియన్, డిపో మేనేజర్లు గౌరవించాలని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. తమ తమ కార్యాలయాల్లో వారిని గంటలకొద్దీ నిరీక్షింప చేసి, బయటకు వచ్చి వారిని పట్టించుకోనట్టే వెళ్లడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సంస్థ కోసం అహర్నిశలు కష్టించి పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు తెలుసుకోవడంలో మీకున్న ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. 'వీలైతే వారి సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించండి. సాధ్యం కాకుంటే అక్కడే ఆ విషయం చెప్పేయండి. అసలు సమస్యలు వినడానికే అధికారులు సిద్ధంగా లేకపోవడం మంచి లక్షణం కాదు' అని ఆర్ఎమ్, డీఎమ్లను హెచ్చరించారు. క్షేత్రస్థాయి ఉద్యోగులతో ప్రేమగా మాట్లాడితే అధికారులకు పోయేదేముందని చురకలు అంటించారు. అనేకమంది ఆర్టీసీ ఉద్యోగులు తనను కలిసిన సమయంలో ఆర్ఎమ్, డీఎమ్ స్థాయిలో సిబ్బందికి కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదని బాధపడుతున్నారని చెప్పారు. అధికారులు ఈ పద్ధతి మార్చుకోవాలని అన్నారు. మంగళవారంనాడిక్కడి ఆర్టీసీ కళాభవన్‌లో 'అచీవర్స్ మీట్-2022' జరిగింది. వంద రోజుల ఛాలెంజ్, ఎక్స్ట్రా మైల్, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్, నూతన ఆవిష్కరణలు సహా పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 650 మంది టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు అవార్డులు ఇచ్చి, సత్కరించారు. ఈ కార్యక్రమానికి చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అంతకుముందు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ 'హైదరాబాద్ దర్శిని' బస్సును ప్రారంభించారు. దీనిలో ప్రయాణిస్తూ యాత్రీకులు హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రకృతి అందాలను తిలకించవచ్చు. అనంతరం కళానిలయంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో సాగుతున్నదని చెప్పారు. ఉద్యోగులకు రెండు డిఏలు ఇచ్చామనీ, దీనివల్ల వారి జీతం 11 శాతం పెరిగిందని తెలిపారు. మరో 4 డిఏలు ఇవ్వాల్సి ఉందనీ, వాటినీ త్వరలో ఇస్తామన్నారు. డిసెంబర్ నాటికి 300 ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీకి వస్తాయనీ, అవి కాకుండా మరో వెయ్యి బస్సులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సంస్థను లాభాల బాటలో నడపడంలో క్షేత్రస్థాయి సిబ్బంది కష్టించి పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఆర్టీసీ ఉద్యోగులు కొంత నిరాశతో ఉన్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందనీ, వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు బడ్జెట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నదనీ, మరో రూ.1,500 ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు తీసుకొనేందుకు అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు. ఆర్టీసీని తప్పకుండా రక్షించుకుంటామని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు క్షేత్రస్థాయిలో హెల్పింగ్ హ్యాండ్స్‌గా ప్రజలకు దగ్గర అవుతున్నారని కొనియాడారు. సంస్థ రోజువారీ ఆదాయం ఇప్పుడు రూ.20 కోట్లకు చేరిందనీ, ఒక్కోసారి రూ.21 కోట్లు కూడా వస్తున్నదని తెలిపారు. ప్రతి శాఖలోనూ నూతన ఆవిష్కరణలు అవసరమనీ, దానికోసం సంస్థలో ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెలలో 6/4 ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి బస్సులో ట్రిప్పుకు 4 నుంచి ఆరుగురు ప్రయాణీకులను అదనంగా ఆర్టీసీ బస్సు ఎక్కించేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. నవంబర్ నెలలో ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి 'హెల్త్ ఛాలెంజ్'ను అమల్లోకి తెస్తున్నామన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే మరింత ఉత్సాహంతో పనిచేయగలుగుతారనీ, దానికోసం రోగనిర్థారణ పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలని సూచించారు. బస్సుల షెడ్యూలింగ్‌లో సమస్యలు వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందనీ, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆలంపూర్ ఎమ్మెల్యే ఆబ్రహం మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో బస్‌డిపో ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం చైర్మెన్, ఎమ్డీ అవార్డు గ్రహీతలను సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.