Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురికి తపంచాలు విక్రయించినందుకే అదుపులోకి నయీమ్ కుడిభుజం
- పాతకేసులనూ తవ్వుతున్న ఎస్ఐబీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రాన్ని వణికించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు కుడి భుజంగా నిలిచిన మరో గ్యాంగ్‌స్టర్ శేషన్న ఎలియాస్ రామచంద్రుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నయీమ్ ఎన్కౌంటరయ్యాక దాదాపు ఆరేండ్ల తర్వాత శేషన్న పోలీసులకు పట్టుబడటం విశేషం. అయితే, పట్టుబడ్డ శేషన్నను ఎస్ఐబీ అధికారులు రహస్య ప్రాంతంలోకి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నట్టు సమాచారం. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల హుమాయున్‌నగర్ పోలీసులు అక్బర్ అనే వ్యక్తిని తపంచాలతో పట్టుకున్నారు. విచారణలో ఈ తపంచాలను శేషన్న నుంచి ఖరీదు చేసినట్టు అక్బర్ వెల్లడించాడు. అంతేగాక, మరో ఇద్దరికి సైతం శేషన్న ఆయుధాలను విక్రయించినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనితో రంగంలోకి దిగిన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఒకపక్క, నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరోపక్క శేషన్న కోసం ఆరా తీయటం ప్రారంభించారు. చివరికి కొత్తపేట్ ప్రాంతంలో శేషన్న కదలికలు సాగుతున్నాయని సమాచారమందుకున్న పోలీసులు అక్కడ కాపు కాసి గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకున్నారు. శేషన్న దగ్గరి నుంచి కొన్ని ఆయుధాలు కూడా ప్రత్యేక పోలీసు బృందం స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. 2016 ఆగస్టు 8న మాజీ నక్సలైటు, గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను షాద్‌నగర్ వద్ద పోలీసులు ఎన్కౌంటర్ జరిపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నయీమ్‌కి కుడిభుజంగా భావించే శేషన్న మరో 30 మంది అనుచరులతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గ్యాంగ్‌స్టర్‌గా నయీమ్ బెదిరింపులు, కిడ్నాప్‌లు, హత్యలతో సృష్టించిన భయంకర వాతావరణం, బలవంతంగా బాధితుల నుంచి లాక్కున్న వందల ఎకరాల భూములు, ఆస్తుల విషయంలో తన బాస్‌కు శేషన్న పూర్తిగా సహకరించినట్టు పోలీసు రికార్డులకెక్కింది. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అతనితో పాటు అతని అనుచరులపై రాష్ట్రవ్యాప్తంగా 270 వరకు కేసులు నమోదు కాగా ఆ కేసులు కొన్నింటిలలో శేషన్న, అతని ముఠా సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆ కేసులింకా కొలిక్క రాకపోగా పట్టుబడ్డ నిందితులు ఒక్కరికి కూడా శిక్షలు పడలేదు. మరోవైపు, నయీమ్‌తో అంటకాగినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారుల పైనా ఎలాంటి చర్యలు తీసుకోబడలేదనే విమర్శలున్నాయి. ఇదిలా ఉంటే, శేషన్న కదిలికలు సాగుతున్నాయనీ, అతనిని పట్టుకొనేంత వరకు తాము సుఖంగా నిద్రపోలేమని కొందరు నయీమ్ బాధితులు గతంలో ఆందోళన వ్యక్తం చేయటమే గాక పోలీసు అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చారు.
అయితే, శేషన్నను పట్టుకునేందుకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నామని ఆ కేసులో నయీమ్ కేసుకు సంబంధించి ప్రభుత్వం వేసిన సిట్ అధికారులు చెబుతూ వచ్చారు. కానీ, రోజులు గడుస్తున్నా శేషన్న ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఎట్టకేలకు శేషన్న పట్టుబడటంతో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సంబంధించిన వెలుగులోకి రాని అనేక నిజాలు బట్టబయలయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. నయీమ్‌కు సంబంధించి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనటమే గాక తన బాస్‌కు తెలియకుండా శేషన్న అనేక నేరాలకు పాల్పడి భారీ మొత్తంలో డబ్బులు కూడబెట్టు కున్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. శేషన్నను లోతుగా విచారిస్తేనే తప్పించి నిజాలు వెలుగు చూడవని నయీమ్ బాధితులు కోరుతున్నారు. మొత్తమ్మీద ఆరేండ్లుగా తమను ముప్పుతిప్పలు పెట్టిన శేషన్న దొరకటంతో నయీమ్ ఎన్‌కౌంటర్‌తో మరుగున పడ్డ అనేక నిజాలు వెలుగులోకి వస్తాయని కొందరు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తుండగా, తమకెక్కడ చిక్కులు ఎదురవుతాయోనని మరికొందరు అధికారులు బిక్కుబిక్కుమంటున్నారని తెలుస్తున్నది.కాగా శేషన్నను గోల్కోండ పోలీసు లు అరెస్టు చేసినట్టు తెలిపారు.