Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-బంజారాహిల్స్/కల్చరల్
స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ఉద్యమ నాయకులకు ప్రభుత్వం ప్రధాన్యం ఇచ్చి గౌరవిస్తోందని చెప్పారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి సందర్భంగా జలదృశ్యం (ట్యాంక్‌బండ్) సమీపంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంగళవారం ఇతర మంత్రులతో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. బాపూజీకి ఘన నివాళి అర్పించారు. హెచ్ఎండీఏ సుమారు రూ.50 లక్షలతో బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ బి.వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
రవీంద్రభారతిలో..
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. అవిశ్రాంత పోరాట యోధుడు బాపూజీ అని, వారి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమానికి లక్ష్మణ్ బాపూజీ నాంది పలికారని తెలిపారు. చేనేత అభివృద్ధి కార్పొరేషన్ అధికారి చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ కమిషన్ సభ్యులు ఉపేందర్, కిషోర్‌గౌడ్, అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, వైస్ చైర్మెన్ మ్యాడం బాబురావు తదితరులు పాల్గొన్నారు.