Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భగత్ సింగ్ స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ యువతకు పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ 115వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో ఆయన విగ్రహానికి వారు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెల్ల దొరలకు వ్యతిరేకంగా భగత్‌సింగ్ వీరోచిత పోరాటం చేశారని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం 23 ఏండ్ల అతిచిన్న వయస్సులోనే ఉరికంబాన్ని ముద్దాడిన గొప్ప విప్లవ పోరాట యోధుడని కొనియాడారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరి దానికి అనుబంధంగా భారత నవజవాన్ సభను స్థాపించి దేశంలోని యువతకు నూరిపోశారని వివరించారు. అలాంటి గొప్ప వ్యక్తి చరిత్రను లేకుండా చేసేందుకు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. అందులో భాగంగానే కర్ణాటకలో బీజేపీ సర్కారు భగత్‌సింగ్ చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తీసేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో భగత్‌సింగ్ స్ఫూర్తితో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీకి నిజమైన దేశభక్తి, జాతీయత భావాలుంటే భగత్ సింగ్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా భగత్‌సింగ్ జయంతి, వర్ధంతి సభలను నిర్వహించాలని కోరారు. పాఠ్య పుస్తకాల్లో భగత్‌సింగ్ జీవిత చరిత్రను చేర్చాలని కేంద్రానికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావేద్, నాయకులు రఘు, పవన్, శ్రీమాన్, రాజు, నరేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.