Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
భదాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీర్వాద బలంతో మళ్లీ నేనే పోటీ చేస్తానని కొత్తగూడెం ఎమ్యెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడెం ప్రజలు తననే కోరుకుంటున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి వనమా పోటీ చేయరని గ్లోబల్ ప్రచారాలు జరుగుతున్నాయని, వాటిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. 40 ఏండ్లుగా అనేక పదవుల్లో ప్రజలకు సేవలు అందించాలని, ప్రజాసేవలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ముందుకు వెళుతున్నానని చెప్పారు. కొత్తగూడెం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత తనకుందని చెప్పారు. నియోజక వర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిదని ఉద్ఘాటించారు. నియోజక వర్గ ప్రజలు, అభిమానులు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లక్ష మంది పేదలకు ఇల్లు కట్టించానని, కొత్తగూడెం ప్రజల చిరకాల కోరిక అయిన ఇండ్ల స్థలాల క్రమ బద్ధీకరణ ద్వారా పట్టాలు ఇప్పించిన విషయాన్ని చెప్పకొచ్చారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజా ప్రస్థానంలోనే ఉంటానని, మళ్లీ నేనే గూడెం నుండి పోటీ చేస్తాని తేల్చి చెప్పారు.