Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ డిమాండ్ పంటలు సాగు చేయాలి
- వరి సాగులో నూక శాతం తక్కువగా వచ్చే వంగడాలు సాగు చేయాలి
- యాసంగి సాగు ప్రణాళిక సిద్దం చేయాలి : వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పప్పుదినుసులు సాగు చేసేందుకు రైతులను ప్రోత్సాహించాలని, వరి సాగులో నూక శాతం తక్కువగా ఉండే వంగడాలు సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో యాసంగి పంటల సాగుకు సమాయత్తం, వానాకాలం పంటల ఉత్పత్తుల అంచనాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శాస్త్రవేత్తల సూచనల మేరకు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలన్నారు. యాసంగి వరి సాగులో మార్చి లోపు కోతలు పూర్తి అయ్యే వంగడాలు సాగు చేయాలని సూచించారు. యాసంగిలో మినుములు, పొద్దు తిరుగుడు, పప్పు శనగ, వేరుశనగ, నూనెగింజల సాగును ప్రోత్సహించాలన్నారు. రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలిపారు. నిబంధనల ప్రకారం పత్తి రైతుకు మద్దతు ధర దక్కేలా, తూకాలలో రైతులు నష్టపోకుండా సీసీఐ, జిన్నింగ్ మిల్లులతో చర్చించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉల్లి, ఇతర కూరగాయల వినియోగం దృష్టిలో పెట్టుకొని యాసంగి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఉల్లి రైతు నష్టపోకుండా వివిధ దేశాలలో ఆచరిస్తున్న విధానాలు పరిశీలించాలని అధికారులకు తెలిపారు. సమావేశంలో ఉద్యానశాఖ సంచాలకులు హన్మంతరావు, అదనపు కమిషనర్ హన్మంతు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, మార్క్‌ఫెడ్ ఎండీ యాదవరెడ్డి, సీడ్స్ ఎండీ కేశవులు, వేర్ హౌసింగ్ ఎండీ జితేందర్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జగదీశ్వర్, అదనపు సంచాలకులు విజరు కుమార్, లక్ష్మణుడు, ఉద్యానశాఖ జేడీ సరోజిని, శాస్త్రవేత్తలు,వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.