Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విషాదంలో డబ్బా గ్రామం
నవతెలంగాణ - ఇబ్రహీంపట్నం/మెట్పల్లి
విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు స్నేహితులు ప్రాణం కోల్పోయారు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన బైండ్ల వినీత్(25), కనుక వికాస్(25) స్నేహితులు. ఇదే గ్రామానికి చెందిన మరో మిత్రుడు భోగ సంతోష్ మెట్పల్లి పట్టణంలోని షానిటరీ షాపు నడుపుతున్నాడు. ముగ్గురూ కలసి మెట్పల్లి పట్టణంలోని ఓ షాపు పాత బోర్డు తొలగించి కొత్త బోర్డు ఏర్పాటు చేస్తున్న క్రమంలో బోర్డు 33కేవీ విద్యుత్ వైర్లపై పడింది. దాంతో విద్యుద్ఘాతానికి గురైన వినీత్, వికాస్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో డబ్బా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నష్టపరిహారం చెల్లించనిదే పోస్టుమార్టం చేయనివ్వబోమని బంధువులు డిమాండ్ చేశారు.
విషాదంలో డబ్బా గ్రామం
డబ్బా గ్రామానికి చెందిన బైండ్ల సంజీవ్ -రాజ్యలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో రెండో వాడైన వినీత్ ఉపాధి కోసం కొన్నేండ్లు గల్ఫ్ వెళ్లి వచ్చాడు. ఈ మధ్యనే వినీత్‌కు పెండ్లి ఎంగేజ్మెంట్ అయింది. ప్రేమ వివాహం చేసుకున్న కనుక వికాస్ కూడా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి రెండు వారాల కిందటే స్వగ్రామానికి వచ్చాడు. ఇంతలో కాలం కన్నెర్ర చేసింది. ఇప్పుడిప్పుడే జీవితాలు ప్రారంభిస్తున్న వారి ఆశలను ఛిదిమేసింది. ఇద్దరి యువకుల మరణంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.