Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అభివృద్ధిలో ముఖరా(కే) గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు కూడా ఆ గ్రామాన్ని సందర్శించి అధ్యయనం చేస్తున్నారనీ, ఆ మోడల్‌ను తమ దేశాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. ఆ గ్రామానికి అద్భుతంగా రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చిన సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కార్యదర్శిని అభినందించారు. ఇటీవల పూణేలో జరిగిన పంచాయతీ రాజ్ సమ్మేళనంలో పాల్గొన్న ఐదు గ్రామాల్లో అత్యున్నత ప్రతిభ కనబరచిన గ్రామంగా ముఖరా(కే) నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆ గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. పూణేలో పొందిన అవార్డును మంత్రికి చూపించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మేధోమథనం నుంచే పల్లెప్రగతి పుట్టుకొచ్చిందని తెలిపారు. ఆ పథకం నుంచి అందిన నిధులు, స్థానిక ప్రజాప్రతినిధుల చొరవ, ప్రజల సహకారంతోనే ముఖరా(కె) గ్రామం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. చెత్తను ఎరువుగా మార్చి ఆదాయం పొందటంలో ముందువరుసలో ఆ గ్రామం ఉండటాన్ని ప్రశంసించారు.