Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైకోర్టుకు దసరా ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7 వరకు సెలవులను ప్రకటించారు. ఎమర్జెన్సీ కేసులను ఈ నెల 30న ఫైల్ చేస్తే వాటిని వచ్చే నెల 6న జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సుమలత డివిజన్ బెంచ్ విచారిస్తుంది.
వచ్చేనెల 10న లైవ్లో హైకోర్టు విచారణ
ప్రయోగాత్మకంగా వచ్చే పదో తేదీన కేసు విచారణను హైకోర్టు లైవ్ ఇవ్వనున్నది. ట్రయిల్ టెస్ట్ పేరిట మొదటి కోర్టు హాల్లో జరిగే కేసు విచారణ లైవ్ ఇస్తారు. లోపాలుంటే తెలుసుకుని వాటిని సవరించి లైవ్లో కేసుల విచారణ జనానికి అందజేస్తామని హైకోర్టు ప్రకటించింది. ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ రిటైరైన రోజు కేసుల విచారణను లైవ్ ఇచ్చింది. తాజాగా మంగళవారం సుప్రీంకోర్టు సీజే యూయూ లలిత్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ మహారాష్ట్రలో శివసేన పార్టీ వివాదంపై జరిపిన విచారణను లైవ్ ఇచ్చింది.
వాన్పిక్ ఆస్తుల జప్తు సరిగాదు : హైకోర్టు
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్తులకు సంబంధించి నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాన్పిక్ ఆస్తుల జప్తు చేయడం సరికాదని హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రకాశం జిల్లాలో 561, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 855 ఎకరాల చొప్పున మొత్తం 1417 ఎకరాలను జప్తు నుంచి విడుదల చేయాలని ఈడీని ఆదేశిస్తూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నంద డివిజన్ బెంచ్ తుది ఉత్తర్వులు జారీ చేసింది. మరో జప్తులో 11 వేల ఎకరాల అసైన్డ్భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తామని ప్రకటించింది. వాన్పిక్ పోర్ట్సు లిమిటెడ్, వాన్పిక్ ప్రాజెక్ట్స్ ఆ భూములపై వేసిన కేసులో తీర్పు చెప్పింది. ఆ రెండు కంపెనీలు సంయుక్తంగా 11 వేల ఎకరాలపై వేసిన కేసులో హైకోర్టు విచారణలో ఉంది.