Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఫిర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పట్టణాలు ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ఎల్) అవార్డులకు ఎంపికయ్యాయి. ఇప్పటికే 16 మున్సిపాల్టీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయా పురపాలిక సంస్థలకు ఆ శాఖ మంత్రి కే తారకరామారావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా సీడీఎంఏ ఎన్.సత్యనారాయణకు సమాచారం అందించినట్టు తెలిపారు. దేశంలోని 1850 పట్టణాలు ఈ పోటీలో పాల్గొనగా, తెలంగాణలోని మూడు పట్టణాలు అవార్డులు దక్కించుకున్నాయి. 15వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో అలంపూర్ పట్టణ స్థానిక సంస్థ ఎంపికైంది. 25 వేల నుంచి 50వేల వరకు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరిలో కోరుట్ల పట్టణం ఎంపికయ్యాయి. ఈ మూడు పట్టణాలకు ఈనెల 30న ఢిల్లీలో టల్కటోరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రధానం చేస్తారు.