Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీని సాధించి తీరతాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేమంటూ కేంద్రమంత్రి జి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడం ద్వారా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఉక్కు ప్యాక్టరీ, రాష్ట్ర విభజన హామీలను సాధించే వరకు రాజ్‌భవన్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలను స్థంభింపచేస్తామని మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేండ్లు గడుస్తున్నా విభజన హామీల పరిష్కారంలో ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదని తెలిపారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య దాదాపు 25 సమావేశాలు జరిగాయని పేర్కొన్నారు. తాజాగా మంగళవారం సమావేశం జరుగుతుండగానే నాణ్యత లేని ఇనుపు ఖనిజం బయ్యారంలో ఉందనీ, అందుకే ఉక్కు కర్మాగారం సాధ్యం కాదంటూ కిషన్‌రెడ్డి చెప్పడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే అవుతుందని విమర్శించారు. నాణ్యత లేకుంటే ప్రయివేట్ వ్యక్తులు రక్షణ స్టీల్ ప్లాంట్ పేరుతో 1.41 లక్షల ఎకరాల భూమిని ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. బయ్యారంలో నాణ్యత కలిగిన ఉక్కులేదనే పేరుతో ప్లాంట్‌ను తిరస్కరించిన బీజేపీ ప్రభుత్వం కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రమన్నా, ప్రజలన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం డొల్ల ప్రకటనలు మానుకుని తక్షణమే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.