Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య సేవలకు ఆన్లైన్ సౌకర్యం కల్పించాలి: వైద్యారోగ్యశాఖ కార్యదర్శికి హెచ్ఆర్డీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్స్ (రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్) యాక్ట్ -2010 కింద ఆరోగ్య సంరక్షణ సేవల రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్‌కు ఆన్లైన్ సౌకర్యం కల్పించాలని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ అసోసియేషన్ అధ్యక్షులు డాక్ట్ కె.మహేశ్ కుమార్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీకి వినతిపత్రం సమర్పించారు. ఆఫ్‌లైన్‌తో ఆయా జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారుల కార్యాలయాల్లో జాప్యంతో పాటు అవినీతికి ఆస్కారం ఏర్పడుతున్నదని తెలిపారు. అర్హులైన డాక్టర్లను వేధించడం సరికాదనీ, నమోదుకు తగినంత సమయమివ్వాలని కోరారు. చట్టం అనుమతి లేకుండా అర్హత లేని వారు, నకిలీలు ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లు నడుపుతున్నారనీ, వాటిని మూసేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో అవకాశం కల్పిస్తామంటూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు రెండేండ్ల క్రితం ఉత్తర్వులిచ్చారనీ, సంబంధిత వెబ్ సైట్ మాత్రం ఇప్పటికీ పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు. అది పని చేసేలా చూడాలని సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో అర్హులైన డాక్టర్లు నడుపుతున్న క్లినిక్‌లను మూసివేయడాన్ని ఆయన ఖండించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీ, పీఎంపీలు షెడ్యూల్డ్ ఔషధాలను సిఫారసు చేస్తున్నారని వివరించారు. రోగులను ఇన్ పేషెంట్లుగా చేర్చుకుంటున్నారనీ, అబార్షన్ వంటి ప్రొసీజర్లు సైతం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.