Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 19 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ గుర్తింపు ఉందని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటికే 11 అటానమస్ కాలేజీలున్నాయనీ, కొత్తగా ఎనిమిది కళాశాలలకు ఆ గుర్తింపును ప్రకటించామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకోవైపు రాష్ట్రంలో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి మంగళవారం న్యాక్ ఏ గ్రేడ్ వచ్చాయని తెలిపారు. న్యాక్ ఏ గ్రేడ్‌తో కొనసాగుతున్న బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఏ ప్లస్ గ్రేడ్ వచ్చిందని వివరించారు. కొత్తగా వచ్చిన ఆ రెండింటితో కలిపి ఈ ఏడాది మొత్తం ఏడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్ గ్రేడ్లు వచ్చాయని పేర్కొన్నారు. కొత్తగా అటానమస్ గుర్తింపు పొందిన కాలేజీలు ఖమ్మం జీడీసీ (మహిళ), నల్లగొండ జీడీసీ (మహిళ), పాల్వంచ జీడీసీ, నర్సంపేట జీడీసీ, విద్యానగర్ జీడీసీ, బిచుకుంద జీడీసీ, కామారెడ్డి జీడీసీ, సత్తుపల్లి జీడీసీ ఉన్నాయని తెలిపారు.