Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2008లో పట్టాల అందజేత
- స్థలాలు కేటాయించకుండా మీనమేషాలు
- పేదల భూమిని ఇతర అవసరాలకు మళ్లింపు
- వారం రోజులుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలు
- భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికారులు
- ఇది కామారెడ్డి జిల్లా జంగంపల్లి వాసుల వ్యథ
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కామారెడ్డి జిల్లా జంగంపల్లిలోని నిరుపేదల బతుకులు దయనీయంగా మారాయి. 14 ఏండ్లు దాటినా సొంతింటి కల సాకారం కావడం లేదు. ఇండ్లు నిర్మించుకునేందుకు 2008లోనే పట్టాలు ఇచ్చారు. కానీ స్థలాలు కేటాయించడంలో దశాబ్దాలుగా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు వందల సార్లు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఎర్రజెండా అండతో తమకు కేటాయించిన స్థలంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఇది కూడా ఓర్వలేని కొంతమంది రాజకీయ నాయకులు.. అధికారులను ఉసిగొల్పి జైల్లో వేస్తామంటూ, కేసులు పెడతామంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పైగా రైతులకు, స్థానికులకు లడాయి పెట్టేందుకు కొత్తగా 'రైతు కల్లాల' గానం ఎత్తుకున్నారు. తమకు ఇండ్ల స్థలాలు చూపి ఇండ్లు నిర్మించి ఇచ్చే వరకు ఈ జాగా వీడేది లేదని పేదలు పట్టుదలగా ఉన్నారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని ఇండ్లులేని నిరుపేదలకు స్థలాలు కేటాయించేందుకు సర్వే నెంబర్ 989, 990, 991లో 14 ఎకరాల స్థలం టీడీపీ హయాంలో 30 ఏండ్ల కిందట ప్రయివేటు వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేశారు. సీపీఐ(ఎం) పోరాటంతో 2008వ సంవత్సరంలో 325 కుటుంబాలకు పట్టాలిచ్చారు. ఒక్కో కుటుంబానికి 80 చదరపు గజాలు కేటాయించారు. ఈ మేరకు అందరికీ హక్కు పత్రాలిచ్చారు. కానీ నాటి నుంచి స్థలాలు కేటాయించడంలో అడుగు ముందుకు పడలేదు. పేరుకు పేదలకు పట్టాలిచ్చినట్టే ఇచ్చి స్థలాలు మాత్రం కేటాయించలేదు. దీనిపై పలుమార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ 14 ఎకరాల్లో నుంచే ప్రస్తుత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు, సబ్ స్టేషన్‌కు, రైతు వేదికకు రెండు ఎకరాల వరకు స్థలం మళ్లించారు. ఇప్పుడు 10 ఎకరాల స్థలం మాత్రమే ఉంది. డబుల్ బెడ్రూం ఇండ్లు సైతం కేవలం 50 మందికే నిర్మించి ఇచ్చారు. సర్వే చేయించి పేదలందరికీ ప్లాట్లు కేటాయించకపోవడంతో చివరకు సీపీఐ(ఎం) నేతలు ప్రయివేటు సర్వేయర్ సాయంతో సర్వే చేయించారు. దాంతో ప్రభుత్వంలో కదలిక వచ్చి ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించారు.
సర్వే పూర్తయిన నేపథ్యంలో అందరికీ స్థలాలు చూపిస్తారని లబ్దిదారులు ఆశపడినా మళ్లీ ప్రక్రియ అటకెక్కింది. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మళ్లీ పోరుబాట పట్టారు. అందరూ ఆ ప్రాంతంలోనే గుడిసెలు వేసుకుని వారం రోజులుగా నివాసం ఉంటున్నారు. 'మల్లు స్వరాజ్యం కాలనీ' ఏర్పాటు చేసుకుని పిల్లాపాపలతో అక్కడే ఉంటున్నారు.
అధికారుల బెదిరింపులు..
స్థానికంగా ఉన్న అధికార పార్టీకి చెందిన నాయకుడు ఈ స్థలంలోని పేదలను వెళ్లగొట్టేందుకు యత్నిస్తున్నాడు. అధికారులను పేదలపైకి ఉసిగొల్పుతున్నాడు. ఇటీవల స్థానిక ఎమ్మార్వో వచ్చి గుడిసె గుడిసెకు ఫొటో తీసుకున్నాడని లబ్దిదారులు వాపోతున్నారు. కేసులు పెడతామని, జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారని 'నవతెలంగాణ'తో వాపోయారు.
ప్రజాప్రతినిధుల ఇండ్లు ముట్టడిస్తాం
జంగంపల్లిలోని పేదలకు 2008లోనే పట్టాలిచ్చారు. వీరందరికీ ప్రభుత్వం స్థలాలు చూపి ఇండ్లు కట్టి నిర్మించి ఇవ్వాలి. లేదంటే ఇండ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం చేయాలి. ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచి మల్లుస్వరాజ్యం కాలనీ పేరు అధికారికంగా ఏర్పాటు చేయాలి. లేకుంటే ప్రజాప్రతినిధుల ఇండ్లు ముట్టడిస్తాం.
- కొత్త నర్సింలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి
ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
2008లోనే పట్టాలిచ్చినా ఇప్పటి వరకు స్థలం చూపలేదు. మేం నిరుపేదలం. మాకంటూ స్వంత ఇల్లు ఉండాలి. ప్రభుత్వం పట్టాలిస్తే జాగలు వస్తాయని సంతోషించాం. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకోలేదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. ప్రభుత్వం మాకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నాం.
- లక్ష్మి, లబ్దిదారు