Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడుపై ప్రభుత్వం ఆదేశాలు
- క్షేత్రస్థాయిలో కమిటీల పరిశీలన
- రెవెన్యూ, ఫారెస్టు, వ్యవసాయాధికారులతో బృందాలు
- అర్హులను తేల్చిన తర్వాత స్థలం కేటాయింపులపై చర్చ
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడంలో సర్కారు మరో ముందడుగు వేసింది. యేడాది పాటు పెండింగ్లో పెట్టిన దరఖాస్తుల దుమ్ము దులిపి క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారం భించింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించింది. మొదట గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులపై చర్చించాలని సూచిం చింది. అలాగే రెవెన్యూ, ఫారెస్టు, వ్యవసాయాధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది. ఎఫ్ఆర్సీ కమిటీల సమక్షంలో ఈ బృందాలు అర్హులను గుర్తించనున్నాయి. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తరువాత జిల్లా స్థాయిలో తుది ఆమోదం తెలపనున్నారు. ఇక జిల్లాస్థాయిలో అర్హుల జాబితాకు ఆమోద ముద్ర పడితే ఎంత విస్తీర్ణంలో స్థలం కేటాయించాలి? ఏ ప్రాంతంలో కేటాయించాలనే అంశాలపై చర్చ జరిగే అవకాశ ముంది. ప్రస్తుతానికి భూకే టాయింపులపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. అయితే అర్హులను గుర్తించే ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోడు రైతులకు హక్కు పత్రాలు కల్పించే అంశంపై ఎట్టకేలకు ప్రభుత్వం కదిలింది. ప్రభుత్వం కటాఫ్ తేదీ ప్రకటించినట్టుగా 13 డిసెంబర్ 2005 నాటికి సాగులో ఉన్న అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభయ్యింది. గతేడాది లబ్దిదారుల నుంచి రాష్ట్ర సర్కారు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాలకు 3 లక్షల 45 వేల దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్లో మొత్తం 195 ఆవాసాల్లో 14,057 క్లయిమ్స్ వచ్చాయి. ఎస్టీలకు సంబంధించి 8,535 దరఖాస్తులను స్వీకరించారు. కామారెడ్డి జిల్లాలో పోడు భూముల హక్కుపత్రాల కోసం మొత్తం 27,221 క్లయిమ్స్ వచ్చాయి. ఇందులో ఎస్టీలకు సంబంధించి 30,224 ఎకరాల కోసం 11,212 దరఖాస్తులు వచ్చాయి. ఇతర సామాజిక తరగతుల నుంచి 38,236 ఎకరాల కోసం 15,989 క్లయిమ్స్ స్వీకరించారు. మొత్తం 68,461 ఎకరాల్లో పోడు వ్యవసాయం కోసం దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 26వ తేదీ నుంచి కమిటీలు గ్రామస్థాయిలో పర్యటన ప్రారంభించాయి. ఈ 15 రోజుల్లో గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో పరిశీలన పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించినట్టు తెలిసింది. అర్హుల్లో ఎస్టీలు 2005 నాటికి సాగులో ఉన్నట్టు నిరూపించుకోవాల్సి ఉంటోంది. అలాగే ఎస్టీయేతరులు మూడు తరాలుగా అంటే 75 ఏండ్లుగా ఆ భూముల్లో సాగు చేస్తున్నట్టు ఆధారాలు చూపాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో వీఆర్ఏలు సమ్మె చేయడంతో పాటు వీఆర్ఓలు ఇతర శాఖలకు మళ్లించడంతో ఈ భారం కూడా గ్రామకార్యదర్శులపై పడింది. గ్రామకార్యదర్శులతో పాటు అగ్రికల్చర్ ఎక్స్టెంట్ ఆఫీసర్, ఫారెస్టు బీట్ ఆఫీసర్, గ్రామసభ నుంచి ఒకరు ఎఫ్ఆర్సీ కమిటీ సమక్షంలో పరిశీలన చేసి అర్హులను గుర్తించనున్నారు. అక్టోబర్ 8, 9వ తేదీల వరకు అర్హుల జాబితాలు జిల్లాస్థాయి కమిటీలకు చేరే అవకాశముంది. చట్టంలో పేర్కొన్న విధంగా 2005 డిసెంబర్ 13 కంటే ముందున్న వారందరికీ పట్టాలివ్వాలని తెలంగాణ గిరిజన సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది.
భూములపై లేని స్పష్టత...
అర్హులను గుర్తించిన తరువాత స్థలం ఎలా కేటాయిస్తారన్న అంశంపై సందిగ్ధం నెలకొంది. అయితే గతంలో పలుమార్లు సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. పోడు హక్కు పట్టాల పంపిణీ పూర్తయిన తర్వాత అటవీ భూములను అంగుళం కూడా కబ్జాకానివ్వబోమని, అటవీ ప్రాంతం చుట్టూ కంచె వేస్తామని తెలిపారు. ఒకవేళ అదే జరిగితే ప్రస్తుతం పోడు రైతులందరికీ ఒక ప్రాంతంలో స్థలాలు చూపే అవకాశమున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంపై ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.
పరిశీలన జరుగుతోంది : నాగోజి, ఎస్టీ అభివృద్ధి అధికారి
పోడు హక్కు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రస్తుతం జరుగుతోంది. ఎఫ్ఆర్సీ కమిటీల సమక్షంలో గ్రామస్థాయి నుంచి వెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ అతి త్వరలో ముగియనుంది.