Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ పథకాన్ని వెంటనే ఉపసంహరించాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో ఎరువుల సబ్సిడీని ఎత్తేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'పీఎం ప్రణామ్' పథకాన్ని ప్రకటించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎరువుల సబ్సిడీ రూ.1.25 లక్షల కోట్ల నుంచి రూ.2.50 కోట్లకు పెరిగిందని వివరించారు. దాన్ని తగ్గించడానికి 'పీఎం ప్రణామ్' పథకాన్ని కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ఇది ఆహారభద్రతకు అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా 1.9 శాతం జనాభా పెరుగుతున్నా, సాగు విస్తీర్ణం తగ్గుతున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎరువుల వినియోగం తగ్గిస్తే, ఉత్పాదకత మరింత తగ్గుతుందని వివరించారు. కాబట్టి 'పీఎం ప్రమాణ్'ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతమిస్తున్న సబ్సిడీలను మరింత పెంచి, భూసార పరీక్షలను బట్టి సేంద్రీయ, రసాయనిక ఎరువుల వినియోగంతో వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఏటా రూ.నాలుగు లక్షల కోట్ల విలువైన వంట నూనెలు, పప్పులు, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు, చిరుదాన్యాల ఉప ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. దీనికి తోడు రసాయనిక ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, సేంద్రీయ ఎరువులను వాడాలనీ, ప్రస్తుతమిస్తున్న సబ్సిడీలను తగ్గించి, వచ్చిన మొత్తంలో 50 శాతం రాష్ట్రాలకు ఇస్తామంటూ కేంద్రం చెప్తున్నదని పేర్కొన్నారు. సేంద్రీయ ఎరువుల వాడకం చైతన్యానికి నిధులు ఇస్తామంటూ ప్రధాని మోడీ ప్రకటిస్తున్నారని తెలిపారు. కానీ శ్రీలంక అనుభవం చూస్తే సేంద్రీయ ఎరువుల వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందని పేర్కొన్నారు. హెక్టారుకు చైనా 400 కిలోలు, అమెరికా 350 కిలోల ఎరువులను వినియోగించి అదనపు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయని వివరించారు. కానీ భారత్లో హెక్టారుకు 175 కిలోల ఎరువులను మాత్రమే వినియోగించి, కేవలం 2.5 టన్నులే దిగుబడి వస్తున్నదని తెలిపారు. చైనా, అమెరికా బడ్జెట్లో ఏడు నుంచి ఎనిమిది శాతం నిధులను వ్యవసాయంపై ఖర్చుచేస్తుంటే, భారత్ మాత్రం కేవలం 2.3 శాతమే ఖర్చు చేస్తున్నదని విమర్శించారు. దీనికి కూడా కోత పెడితే దిగుబడి తగ్గి రైతులు దివాళాతీస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులు తమ భూములను కార్పొరేట్ సంస్థలకు అమ్ముకునేందుకు చేసిన కుట్ర ఇది అని తెలిపారు. పార్లమెంట్లో వీగిపోయిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలో భాగమే ఇదని విమర్శించారు. తక్షణమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు.