Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణపై ఒత్తిడి చేయొద్దు... ఏపీకి విద్యుత్ బకాయిల కేసులో ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏపీకి విద్యుత్ బకాయిల చెల్లింపుల నిమిత్తం కేంద్ర సర్కార్ ఇచ్చిన ఆదేశాల అమలుకు ఒత్తిడి చేయొద్దంటూ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు ఏడు వేల కోట్ల రూపాయల చెల్లింపులకు కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వంతోపాటు, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వేరు వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ శ్రీనివాస్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. తెలంగాణ వాదనలు వినకుండా ఏపీకి బకాయిలు చెల్లించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ప్రకటించింది. కేంద్రం, ఏపీ ప్రభుత్వం, ఏపీ విద్యుత్ సంస్థలు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులిచ్చింది. విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది.
తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలపై అప్పిలేట్ వ్యవస్థ ఉందనీ, అక్కడ కాకుండా నేరుగా కేంద్రం ఆదేశాలు జారీ చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. కేంద్రం, ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ కేంద్రానికి సహకరించిందనీ, అందుకే ఆ రాష్ట్రానికి అనుకూలంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉండగా తెలుగు రాష్ట్రాల విషయంలో ఆఘమేఘాలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటోందని తెలిపారు. ఏపీకి అనుకూలంగా కేంద్రం చేస్తున్నదనీ, కక్షపూరితంగా కేంద్రం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు.
ఏపీ పవర్ డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయనీ, బకాయిలు చెల్లింపు ఉత్తర్వులపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయొద్దని ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. మౌలిక వసతుల కల్పన కోసం ఏపీ డిస్కంలు ఆర్థిక సంస్థల నుంచి లోన్లు తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రాల ఏర్పాటు తర్వాత జరిగిన విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేసినందుకు ఈ వివాదానికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వర్తించదన్నారు.. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందనీ, అందుకే కేంద్రం తెలంగాణను బకాయిలు చెల్లించాలని ఆదేశించిందని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు.. బకాయిల చెల్లింపు కోసం తెలంగాణపై ఒత్తిడి చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. రూ.6,756.92 కోట్లు విద్యుత్ బకాయిలకు సంబంధించి తెలంగాణపై ఒత్తిడి తేవద్దని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదంది. విచారణను అక్టోబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.