Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన ఈడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం రెండో రోజు ఎనిమిది గంటల పాటు విచారిం చారు. విదేశాల్లో మంచిరెడ్డికి సంబం ధించిన వ్యాపార లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాల పైనే ఈడీ ఎక్కువగా దృష్టిని సారించినట్టు తెలిసింది. ముఖ్యంగా, విదేశాల్లో ఉన్న తన బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి తన వ్యాపారాల కోసం ఏ మేరకు డబ్బులను సేకరించారు? వాటిని ఏ విధంగా ఉపయోగించారు? దానికి సంబంధించిన సమాచారాన్ని దేశ ఆర్థిక విభాగానికి ఎంతవరకు అందించారు? పూర్తి సమాచారాన్ని సమగ్రంగా ఇచ్చారా? లేదా? తదితర కోణాల్లో మంచిరెడ్డి విచారణ కొనసాగినట్టు తెలిసింది. సింగపూర్‌లో బంగారు గనులలో పెట్టుబడులు పెట్టిన వైనం పైన ఈడీ అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. మొత్తమ్మీద ఫెమా చట్టాన్ని ఉల్లంఘించే తీరులో మంచిరెడ్డి వ్యాపార లావాదేవీలు సాగినట్టుగా ఈడీ అనుమానిస్తున్నట్టు తెలిసింది. అందుకు తగిన కొన్ని ఆధారాలు కూడా మంచిరెడ్డి ముందుంచి ప్రశ్నించారని సమాచారం. మొత్తమ్మీద మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎనిమిది గంటలకు పైగా ఆయనను విచారించిన ఈడీ తర్వాత అవసరమైతే పిలుస్తామంటూ పంపించారని తెలిసింది. కాగా, మంచిరెడ్డికి సంబంధించి తమకు అవసరమైన సమాచారాన్ని చాలా వరకు సేకరించగలిగారని ఈడీ వర్గాలను బట్టి తెలిసింది.