Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రాప్ లైఫ్ ఇండియా సంస్థ వార్షిక సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజలకు నాణ్యమైన పోషకాహారం అందించడమే ప్రపంచానికి పెద్ద సవాల్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భావితరాలకు నాణ్యమైన ఆహారం అందించడంలో వ్యవసాయ రంగమే కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు. బుధవారం ఢిల్లీలో క్రాప్ లైఫ్ ఇండియా సంస్థ 42వ వార్షిక సమావేశం సందర్భంగా 'వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై' నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రులు సూర్యప్రతాప్ షాహి, కమల్ పటేల్, బీసీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగు అనుకూల భూవిస్తీర్ణంలో ప్రపంచంలో భారతదేశానిది రెండవస్థానం దక్కిందన్నారు. దేశంలో ఉన్న భూకమతాలు అన్నింటినీ క్రాప్ కాలనీలుగా విభజించాలని సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయో గుర్తించి ఆ మేరకు అక్కడ ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. సాంప్రదాయ పంటల నుంచి రైతాంగాన్ని మళ్లించడానికి దేశ, విదేశాల్లో అవసరమైనటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఎగుమతులు, సేకరణ కేంద్రం చేతుల్లో ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన పంటల వైవిధ్యీకరణకు కేంద్రం ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. అప్పుడే రైతాంగం సాంప్రదాయ సాగును వీడి ఇతర పంటల సాగుకు మొగ్గుచూపుతారని సూచించారు. దేశంలో నూనెగింజలు, పప్పుదినుసుల కొరత ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.