Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది టర్నోవర్ రూ.26,607 కోట్లు
- నికర లాభం రూ.1,227 కోట్లు
- కార్మికులకు బోనస్‌గా ఇచ్చే మొత్తం రూ.368 కోట్లు :ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గడచిన ఆర్థిక సంవత్సరం (2021-22) సింగరేణి కాలరీస్ సంస్థ ఆర్జించిన లాభాల్లో 30 శాతాన్ని కార్మికులకు బోనస్‌గా ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశించారు. సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపినట్లు ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి మొత్తం టర్నోవర్ రూ. 26,607 కోట్లు కాగా, రూ.1,227 కోట్ల నికరలాభం ఆర్జించినట్టు తెలిపారు. ఈ లాభంలో 30 శాతం (రూ.368 కోట్లు) ను దసరా పండుగ సందర్భంగా కార్మికులకు బోనస్‌గా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ వేతనంతో పాటే బోనస్‌ను కూడా చెల్లిస్తామని ఈ సందర్భంగా సీఎమ్‌డీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 70 మిలియన్ టన్నుల లక్ష్య సాధనకి సింగరేణీయులు పునరంకితమై, పనిచేయాలని కోరారు. ఈ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఉద్యోగులు, యూనియన్ నాయకులు, కార్మికుల సమిష్టి కృషి తోనే సాధ్యమైందన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా ఈ లాభాన్ని ఆర్జించిందని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రూ. 3,596 కోట్లను చెల్లించామన్నారు. లాభాల వాటా చెల్లింపు సంస్థలోని 44 వేల మంది ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు. 2021-22 లో రికార్డు స్థాయిలో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 655 లక్షల టన్నుల రవాణా చేశామనీ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 8,808 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న పలు అభివృద్ధి, కార్మిక సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.