Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కుల వివక్ష, అవమానం, అణిచివేతలకు బలై ...గురై ఎంతో మానసిక వ్యధ, క్షోభ అనుభవంచి అణగారిన ప్రజావేదనను చందోబద్ధ పద్యాల్లో మరే కవి చెప్పజాలని ఎన్నో అంశాల్ని అద్భుతంగా రాసిన మహాకవి, శాసనమండలి సభ్యులు గుర్రం జాషువా అని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రచయిత, కవి కె.ఆనందాచారి ఘన నివాళులు అర్పిస్తూ ప్రసంగించారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై గల జాషువా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆసంస్థ సభ్యులు తంగిరాల చక్రవర్తి, అనంతోజు మోహన్‌కృష్ణ, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ తరపున డి.కృష్ణారెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రధాన కార్యదర్శి కోయ చంద్ర మోహన్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి తదితరులు ఘన నివాళులర్పించారు. గబ్బిలం, పిరదౌసి, క్రీస్తు చరితం లాంటి కావ్యాలు తెలుగు జాతికి గొప్ప సాహిత్య సంపదగా జాషువా అందించారనీ, అణగారిన ప్రజల వేదనను, వివక్షను, ఆకలిని, అవమానాన్ని అగ్ర కవి శ్రేష్ఠుల గర్వోన్నతని ఎదిరించి దళితుల వ్యధను, ఆవేదనా భరితంగా తన కావ్యాల్లో రాశారని అన్నారు. జాషువా చెప్పిన అంశాలు నేటికీ దేశంలో దళితులపై, పేదలపై, మైనార్టీలపై దౌర్జన్యాలు, దారుణంగా జరిగే తీరును సోదాహరణలతో ఆనందాచారి భావోద్వేగంగా జాషువా పద్యాల్లోని భావాన్ని విపులీకరిస్తూ ప్రసంగించారు. కవులు, పాలకులు, దళిత సంఘాలు జాషువాను, ఆయన జయంతి, వర్థంతుల్ని మరిచిపోతున్నారనీ, ఆయన వర్థంతిని తెలంగాణ సాహితీ జరపడం గొప్ప విషయమని ట్యాంక్ బండ్ సందర్శకులు నిర్వాహకులను అభినందించారు. గతంలో శ్రీశ్రీ, గురజాడ, మఖ్దూంలకూ తెలంగాణ సాహితీ ట్యాంక్‌బండ్‌పై విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.