Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్నం, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డీజీ, అబ్బాస్
- జీహెచ్ఎంసీ సౌత్ జోనల్ ఆఫీసు ఎదుట ప్రజా సంఘాల ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, స్థలం ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని, నిత్యావసర సరుకులపై జీఎస్టీ రద్దు చేయాలని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా బుధవారం నిర్వహించారు. జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ ఆఫీసు ఎదుట నిర్వహించిన ధర్నాలో పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నరసింహారావు, అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని, ఏడాదికి లక్ష ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు పేదలకు ఇండ్లు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. పాతబస్తీలో నివసించే మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ, బీసీలు, ఇతర పేదలు ఇంటి అద్దెలు చెల్లించలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జి.విఠల్, సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సౌత్ అధ్యక్ష కార్యదర్శులు ఎం.శ్రావణ్ కుమార్, పి.నాగేశ్వర్, ఆవాజ్ నాయకులు అబ్దుల్ సత్తార్, గిరిజన సంఘం నాయకులు ఎం.బాలు నాయక్, కృష్ణనాయక్, ఐద్వా నాయకులు ఎం. లక్ష్మమ్మ, పి.శశికళ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరుపేదలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత అల్లూరి సెంటర్ పార్టీ ఆఫీసు నుంచి నటరాజ్ సెంటర్, శాస్త్రి రోడ్, రాజీవ్ మార్కెట్ మీదుగా తహసీల్దార్ ఆఫీసుకు వందలాది మందితో భారీ ర్యాలీ తీశారు. అనంతరం తహసీల్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పట్టణ కమిటీ సభ్యురాలు కె.సత్య అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పి ఎనిమిదేండ్లు అయినప్పటికీ ఇప్పటికి అమలుకు నోచుకోలేదన్నారు. హామీలు నీటి మూటలుగానే మిగిలి పోయాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి ప్రజల మీద భారాలు పెంచి కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.