Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్ఈ ఏడీ లింగయ్యకు టీపీటీఎల్ఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయివేట్ స్కూల్ టీచర్‌ను దూషించిన మంచిర్యాల డీఈవోపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రయివేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు (డీఎస్ఈ ఏడీ) లింగయ్యను ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎ విజరుకుమార్ నేతృత్వంలో బుధవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. సెలవులివ్వని ప్రయివేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరిన టీచర్‌ను బూతులు తిట్టిన మంచిర్యాల డీఈవో వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలన్నింటికీ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కొన్ని ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు సెలవులివ్వకుండా తరగతులు నిర్వహిస్తున్నాయని విమర్శించారు. ఈ విషయాన్ని మంచిర్యాలకు చెందిన ఒక స్కూల్ టీచర్ ఆ జిల్లా డీఈవో వెంకటేశ్వర్లుకి ఫోన్ చేసి విషయాన్ని వివరించారని తెలిపారు. సమాధానం ఇవ్వాల్సిన ఆయన అడ్డగోలుగా బూతులు తిట్టడం సిగ్గుచేటని విమర్శించారు. బాధ్యత గల అధికారి అయి ఉండి ఇష్టారీతిన తిట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇలా తిట్టడం ఉపాధ్యాయులను అవమానించడమేనని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని కోరారు. ప్రయివేట్ టీచర్లు ఇప్పటికే యాజమాన్యాల వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. వారికి అండగా నిలవాల్సిన అధికారి దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రవ్నించారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎల్ఎఫ్ నాయకులు సైదులు, శివ తదితరులు పాల్గొన్నారు.
టీచర్లను అవమానించిన మంచిర్యాల డీఈవో : టీపీటీఎఫ్
ప్రయివేటు టీచర్ల మనోభావాలను కించపరుస్తూ అవమానకరంగా మాట్లాడిన మంచిర్యాల డీఈవో వెంకటేశ్వర్లుపై తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రయివేటు టీచర్ల ఫోరం (టీపీటీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్‌అలీ, ప్రధాన కార్యదర్శి నిరుపమ సంజరు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. దసరా సెలవులివ్వకుండా ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘిస్తున్నాయని విమర్శించారు. వర్క్‌షాప్, శిక్షణ, ఓరియెంటేషన్ పేరుతో ఉపాధ్యాయులను బలవంతంగా పాఠశాలలకు రప్పిస్తున్నాయనీ, వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. విద్యాశాఖలో ఇలాంటి అధికారులుండడం వల్లే విద్యావ్యవస్థ నాశనమవుతున్నదని విమర్శించారు. ఆ డీఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తూ టీచర్లను విధులకు హాజరుకావాలంటున్న ప్రయివేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేసి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.