Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐఐటీల్లో ఫీజులను భారీగా పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే విరమించుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబయి, ఐఐటీ అలహాబాద్, ఐఐటీ హైదరాబాద్లో కోర్సుల వారీగా 53 శాతం నుంచి 500 శాతం వరకు ఫీజులను భారీగా పెంచి విద్యార్థులపై భారం మోపడాన్ని బుధవారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. బాగా చదువుకుని ఉత్తమ ర్యాంకు సాధించిన ఎస్సీ,ఎస్టీ, వికలాంగులతోపాటు పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని విమర్శించారు. ఇప్పటికే రిజర్వుడు కేటగిరీల్లో 63 శాతం అడ్మిషన్లు తగ్గి ఆ వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. మోడీ ప్రభుత్వం నూతన విద్యావిధానంలో భాగంగానే ఉన్నత విద్య ఫైనాన్సింగ్ ఏజెన్సీ (హెచ్ఈఎఫ్ఏ)ను ఏర్పాటు చేసి విశ్వవిద్యాలయాలు స్వయం పోషకాలుగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసిందని పేర్కొ న్నారు. అందులో భాగంగానే ఫీజుల పెంపుదలకు విశ్వవిద్యా లయాలు, ఐఐటీలు పూనుకుంటున్నాయని విమర్శించారు. క్రమంగా వర్సిటీలను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రం చూస్తున్నదని విమర్శించారు. ఇది సరైంది కాదని తెలిపారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్న విధానాలను మానుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజులు పెంచుతూ ఇచ్చిన ఆదేశాలను వెంటనే విరమించుకోవాలని ఆయన కోరారు.