Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తదుపరి విచారణకు కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
గ్యాంగ్‌స్టర్ శేషన్నకు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు నగర పోలీసులు నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆరేండ్ల పాటు పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఖ్య అనుచరుడు శేషన్నను మంగళవారం గోల్కొండ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 9 ఎంఎం పిస్టల్‌తో షేక్‌పేట్ నుంచి మహీంద్రా కార్లో శేషన్న వెళ్తుండగా తాము అరెస్టు చేసినట్టు నగర పోలీసు కమిషనర్ సి.వి ఆనంద్ ప్రకటించారు. కాగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య శేషన్నను నాంపల్లి కోర్టులో గోల్కొండ పోలీసులు హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. తొమ్మిదికి పైగా హత్యలు, లెక్కలేనన్ని భూకబ్జాలు, కిడ్నాప్‌లు, వైరి పక్షాలకు బెదిరింపులతో పోటు ఆయుధాల అమ్మకాలకు పాల్పడినట్టుగా గోల్కొండ పోలీసులు తాజాగా శేషన్నపై కేసులను నమోదు చేశారు. గతంలో ఉన్న కేసులతో పాటు ప్రస్తుతం శేషన్న చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి సమగ్రంగా విచారణ జరపటానికి శేషన్నను వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోర్టును కోరనున్నట్టు ఆసిఫ్‌నగర్ ఏసీపీ మారుతి 'నవతెలంగాణ'కు తెలిపారు. మొత్తమ్మీద శేషన్న అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరుడుగట్టిన నయీమ్‌కు కుడి భుజమైన శేషన్న తన బాస్‌తో సమానంగా నేరాలకు పాల్పడ్డాడనీ, అలాంటి వ్యక్తి అరెస్టును ప్రెస్ కాన్ఫరెన్సులో పోలీసు ఉన్నతాధికారులు ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా అర్ధరాత్రి పూట ప్రెస్‌నోట్ విడుదల చేయటం ద్వారా శేషన్న అరెస్టును నగర కొత్వాల్ ప్రకటించటం సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. శేషన్న అరెస్టుకు సంబంధించి ఇంతవరకు జరిగిన జాప్యంతో పాటు నిందితుడు మూలాలు, అతను చేసిన నేరాలు, తనకు కొందరు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల నుంచి లభించిన తెరవెనక సహకారానికి సంబంధించి మీడియా నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతాయనే ఉద్దేశంతోటే విలేకరుల సమావేశం ఏర్పాటు చేయకుండానే జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించే ప్రయత్నం చేశారని అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కస్టడీకి తీసుకున్న తర్వాత దర్యాప్తు అధికారులు శేషన్న నుంచి నిజాలను దర్యాప్తు ఏ మేరకు రాబడతారనే ఉత్కంఠ నెలకొన్నది.