Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 81 ప్రయివేటు ఆస్పత్రులను అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం ...వైద్యశాఖ అధికారులు 33 జిల్లాల్లో 1,569 ప్రయివేటు ఆస్పత్రులను తనిఖీ చేసి 416 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. 68 ఆస్పత్రులకు జరిమానా విధించారు. సీజ్ అయిన వాటిలో జిల్లాల వారీగా సంగారెడ్డిలో 16, నాగర్ కర్నూల్, భద్రాద్రి-కొత్తగూడెంలో 14, రంగారెడ్డి 10, వికారాబాద్ ఐదు, హైదరాబాద్లో మూడు, ఖమ్మంలో రెండు, ములుగులో మూడు, నిజామాబాద్ రెండు ఉన్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం క్రమబద్దీకరించడంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఇక పార్మసీ వంతు...
తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ తనిఖీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఈ మేరకు కౌన్సిల్ అధ్యక్షలు ఏ.సంజరు రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఫార్మసీ, ఔషధ చట్టాల ప్రకారం మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టులు మాత్రమే మందులు ఇవ్వాలని తెలిపారు. అర్హత లేని వారు ఇస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. అనర్హులు ఇచ్చే హానికర మందులు వాడితే ప్రాణాలు పోయే ప్రమాదముందనీ, రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్న ఆరోగ్య తెలంగాణ దిశగా ఉపయోగపడేలా తమ తనిఖీలు ఉండబోతున్నాయని చెప్పారు.