Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్జీలు పెంచినా ఆర్టీసీ ఆదాయం అంతంతే
''రాఖీ పౌర్ణమి రోజు రూ.21 కోట్ల ఆదాయం సాధించాం. ఆగస్టు 22న కూడా రూ.20 కోట్లు రోజువారీ ఆదాయం వచ్చింది. 20 డిపోలు లాభాల్లోకి వచ్చాయి'' ఈ నెల 27న జరిగిన అచీవర్స్ మీట్లో టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ చెప్పిన మాటలు ఇవి. సెస్‌ల పేరుతో బస్సు చార్జీలు పెంచాక, రోజువారీగా రావల్సిన ఆదాయం అప్పుడప్పుడు మాత్రమే రావడం వెనకున్న కారణాలు ఏంటనే దానిపైనే సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెస్‌ల పేరుతో చార్జీలు పెంచి, ఆదాయం పెరిగిందంటూ ప్రచారం చేసుకోవడం చిత్రంగానూ ఉంది.
- అంకెలతో అధికారుల గారడీ
- ఐదు నెలల్లో తగ్గిన 382 బస్సులు
- చార్జీలు పెంచి ఘనత సాధించినట్టు ప్రచారం
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
సెస్‌ల పేరుతో పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీల్లో రోజుకు రూ.2.69 కోట్లు మాయం అవుతున్నాయి. ఈ సొమ్ము ఎక్కడికెళ్తుందో అర్థం కావట్లేదు. టీఎస్ఆర్టీసీ అధికారులు చెప్తున్న గణాంకాలతోనే పెరిగిన సెస్ చార్జీలను లెక్కిస్తే ఈ విషయం బయటపడింది. సొమ్ము దారి మళ్లుతుందా లేదా బస్సు సర్వీసులు తగ్గించారా అనే దానిపై ఆర్టీసీ యాజమాన్యమే సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా ఆర్టీసీ అద్భుతంగా పనిచేస్తున్నదనీ, ఆదాయం పెరిగిందనీ చైర్మెన్, ఎమ్‌డీలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీనిపై 'నవతెలంగాణ' చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఆర్టీసీలో మొత్తం బస్సుల సంఖ్య 9,057. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ సంఖ్య 8,675కు తగ్గింది. అంటే 382 బస్సులు స్క్రాప్ కిందకు వెళ్లిపోయాయి. దీనివల్ల పలు రూట్లలో బస్సులను రద్దు చేయడం లేదా క్రమబద్ధీకరణ పేరుతో ట్రిప్పుల్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు ఆయా గ్రామాల ప్రజలకు ప్రజా రవాణా దూరమైంది. ఈ ఏడాది మార్చిలో 31.75 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు తిరిగితే, ఆగస్టులో 32.08 కి.మీ., తిరిగాయి. మార్చి నెలలో కిలోమీటర్‌కు వచ్చిన ఆదాయం (ఈపీకే) రూ.35.08 కాగా, ఆగస్టులో ఈపీకే రూ.45.05కి పెరిగింది. ఇక్కడ మార్చి నెలతో పోల్చడానికి ప్రధాన కారణం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే నెల మధ్యలోనే ఆర్టీసీ యాజమాన్యం దఫదఫాలుగా వివిధ సెస్‌ల పేరుతో ప్రయాణికులపై ఆర్థికభారాలు మోపింది. ఏటా ఆర్టీసీకి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ప్రయాణీకుల సీజన్‌గా గుర్తిస్తారు. ఈ టైంలోనే సెస్‌ల పేరుతో టిక్కెట్ల రేట్లు పెరగడంతో సహజంగానే ఆదాయం పెరుగుతుంది. అయితే పెరిగిన చార్జీల మేరకు సంస్థకు ఆదాయం రావట్లేదు. పైపెచ్చు గతంకంటే 3 శాతం అక్యుపెన్సీ రేషియో (ఓఆర్) కూడా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు సంస్థ ఆదాయం మరింత పెరగాలి కదా! ఎందుకు రావట్లేదనే దానిపై అధికారులు సింహావలోకనం చేసారో లేదో తెలీదు. పైకి మాత్రం ఆర్టీసీ అద్భుతంగా నడుస్తుందని మాత్రం చెప్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే నెల వరకు ఐదు దఫాలు సెస్‌ల పేరుతో టిక్కెట్ చార్జీలు పెంచారు. చార్జీల క్రమబద్ధీకరణ, సేఫ్టీ సెస్, ప్రయాణీకుల వసతుల కల్పన, డీజిల్ సెస్, ఆ తర్వాత కిలో మీటర్ల లెక్కన డీజిల్ సెస్ విధింపు, బస్పాసుల పెంపు, సీటు రిజర్వేషన్ చార్జీల పెంపు వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో బస్‌పాసులు, సీటు రిజర్వేషన్ భారాలను మినహాయిస్తే ప్రయాణీకులపై రోజుకు పడే ఆర్థిక భారం సగటున రూ.6.01 కోట్లు (ఏడాదికి రూ.2,195.75 కోట్లు). అంటే అప్పటి వరకు ఆర్టీసీకి వస్తున్న ఆదాయంకంటే అదనంగా రోజుకు రూ.6.01 కోట్లు రావాలి. నిత్యం ఆర్టీసీ బస్సులు 32 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయనేది అధికారిక లెక్క. బస్సు చార్జీలు పెరగకముందు కూడా అంతేమంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. చార్జీలు పెరగని మార్చి నెలలో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం సగటున రూ.11.14 కోట్లు. చార్జీలు పెరిగాక ఆగస్టు నెలలో ఆర్టీసీకి వచ్చిన రోజువారీ సగటు ఆదాయం రూ.14.46 కోట్లు. చార్జీలు పెరిగాయి కాబట్టి గతంలో వస్తున్న రూ.11.14 కోట్లకు అదనంగా రోజుకు మరో రూ.6.01 కోట్లు రావాలి. అంటే ఆదాయం సగటున రూ.17.15 కోట్లు ఉండాలి. కానీ రూ.14.46 సగటు ఆదాయం మాత్రమే వస్తున్నది. మిగిలిన రూ.2.69 కోట్ల సొమ్ము ఎక్కడికెళ్తుంది... అసలు వసూలు అవుతున్నదా లేదా... వసూలైతే లెక్కల్లో ఎందుకు చూపించట్లేదు అనే శేష ప్రశ్నలకు యాజమాన్యమే సమాధానం చెప్పాలి. నిన్నటికి నిన్న సింగరేణి కాలరీస్ సంస్థ తమ వార్షిక ఆదాయ, వ్యయాలను బహిరంగంగా ప్రకటించి, లాభాల్లో కార్మికులకు 30 శాతం వాటాను ఇస్తున్నట్టు చెప్పింది. కానీ ఆర్టీసీలో అలాంటి పారదర్శకత కనిపించట్లేదనీ, సర్వం గోప్యమేనని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.