Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమీషన్ల కక్కుర్తి
- ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోని కార్మికశాఖ
- నిధుల భద్రతపై అనుమనాలు
- ఎఫ్‌డీల నిర్వహణ!
- బ్యాంకుల్లో డబ్బులేయడం.. తీయడమే
నవతెలంగాణ-సిటీబ్యూరో
'ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిక్స్డ్ డిఫాజిట్లకు అనుమతి ఉండాల్సిందే. అన్ని ప్రభుత్వ, అండర్‌టేకింగ్ ఏజెన్సీలు, ఇన్స్టిట్యూషన్లు, కార్పొరేషన్లకు సంబంధించిన ఎఫ్డీలను మూడు బ్యాంకులకు మించి పెట్టొద్దు' అని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన జీఓ ఎంఎస్ నెం.18ని జారీచేసింది. కాని తెలంగాణ కార్మిక శాఖలోని భవన, ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్‌బోర్డు(బీఓసీడబ్ల్యూ) అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సర్కార్ నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తోంది. అయినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. సర్కార్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. కార్మికుల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన నిధులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. అయితే తెలుగు అకాడమీలో జరిగిన నిధుల అవకతవకల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. వీటిని కార్మిక శాఖ ఎక్కడా అమలుచేయడంలేదన్న విమర్శిలున్నాయి.
ఆయన పనే...
తెలంగాణ కార్మిక శాఖలోని భవన, ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్‌బోర్డు(బీఓసీడబ్ల్యూ)లో
సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి బాధ్యత ఎఫ్‌డీల నిర్వహణ మాత్రమే. తొమ్మిదేండ్లుగా ఆయన అక్కడే ఉంటున్నారు. డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారుల గడువు ఐదేండ్లు మాత్రమే. ఇక్కడ తొమ్మిదేండ్లుగా ఒకే స్థానంలో ఉంటున్నారంటే కార్మికశాఖ మంత్రి, ఉన్నతాధికారుల అండదండలేనిది సాధ్యం కాదని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఆ అధికారి రోజువారీగా ఎఫ్‌డీల నిర్వహణతోపాటు తరచూ బ్యాంకు అధికారులతో చర్చలు జరుపుతుంటారు. కమీషన్ల కోసమే ఎఫ్డీలను ఎక్కువగా బ్యాంకుల్లో పెట్టారని విమర్శలూలేకపోలేదు. ఆ అధికారిపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కార్మికశాఖలో చర్చించుకుంటున్నారు.
సర్కార్ ఆదేశాలు బేఖాతరు
తెలుగు అకాడమీలో జరిగిన నిధుల గోల్మాల్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెం.18ని జారీచేసింది. ఎఫ్డీలను 3బ్యాంకులకు మించి పెట్టకూడదని సూచించింది. కాని కార్మికశాఖ మాత్రం రూ.1000కోట్ల నిధులను ఏడు బ్యాంకుల్లో 150కిపైగా బ్రాంచ్‌ల్లో 450కిపైగా ఎఫ్డీలను పెట్టడం గమన్హాం. ఒక్క కెనరా బ్యాంకుకు సంబంధించిన 90 బ్రాంచుల్లో ఎఫ్డీలు పెట్టారంటే కమీషన్లు ఏ స్థాయిలో దండుకుం టున్నారో అర్థమవుతోంది. కమీషన్లకు కక్కుర్తి పడిన అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలోతొక్కి దర్జాగా ఎఫ్డీలను నిర్వహిస్తు న్నారని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ.25లక్షల కమీషన్లు?
ఫిక్స్డ్ డిపాజిట్లను చేయడానికి రూ.2కోట్లకు మించకూడదని ప్రభుత్వం పరిమితి విధించింది. ఈ నిబంధనను అతిక్రమించకూడదని భావించిన కార్మిక శాఖ అధికారులు ప్రతి బ్రాంచ్‌లో రూ.1.90కోట్ల చొప్పున డిపాజిట్ చేశారు. రూ.1000కోట్లకు సంబంధించిన 500 ఎఫ్‌డీల రూపంలో దాచిపెట్టారు. ఈ లెక్కన ఒక్కో ఎఫ్డీకి రూ.5వేల చొప్పున తీసుకుంటే రూ.25లక్షల కమీషన్లు పొందే అవకాశముందని నిపుణుల అభిప్రాయం. అయితే ఈ విషయంపై కార్మికశాఖ ఉన్నతాధికారిని అడిగితే.. ఈ విషయంపై తనకు తెలియదని, తెలుసుకుని చెబుతానని సమాధానమిచ్చారు.
విచారణ జరిపించాలి
నిధులను ఫిక్ప్డ్ డిపాజిట్ చేయడంలో కార్మిక శాఖ ఉన్నతాధికారులు పూర్తిగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఆ అధికారులపై విచారణ జరిపించాలి. తెలుగు అకాడమీలో ఎఫ్డీ గోల్మాల్ జరిగిన తర్వాత ఎఫ్‌డీల నిర్వహణలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసినా కార్మిక శాఖ అధికారులు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పటికీ కార్మికశాఖ మాత్రం అమలుచేయడంలేదు.
- ఎం. శ్రీనివాస్, సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కార్యదర్శి