Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీబీఎస్, బీడీఎస్‌లో రిజర్వేషన్లు కల్పిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు
- ఓపెన్ కోటా 15శాతం
- రాష్ట్ర విద్యార్థులకే మెజారిటీ సీట్లు దక్కేలా సర్కారు నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వరాష్ట్రంలో ఉంటూ డాక్టర్ చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ బీ కేటగిరీ సీట్లలో కేటాయించే 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకే దక్కేలా అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం జీవో నెంబర్ 129, 130లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రయివేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి. రాష్ట్రంలో 20 నాన్ మైనారిటీ, 4 మైనారిటీ ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 3,750 సీట్లున్నాయి. నాన్ మైనారిటీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ 1,120 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఓపెన్ కోటాగా ఉన్న ఈ సీట్ల కోసం అన్ని రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడేవారు. తాజా సవరణ మేరకు బి కేటగిరీలో 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15శాతం అంటే 168 సీట్లు మాత్రమే ఓపెన్ కోటాలో రాష్ట్ర విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడతారు. ఇదే విధంగా మైనారిటీ కాలేజీలో 25 శాతం బీ కేటగిరీ కింద ఇప్పటి వరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 116 సీట్లు స్థానిక విద్యార్థులకే దక్కనున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోటా సీట్లలో రాష్ట్ర విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్ లేదు. బీ కేటగిరీలో ఉన్న 35శాతం కోటాలో ఎలాంటి లోకల్ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సొంతం చేసుకుంటున్నారు. తద్వారా రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. దీంతో బీ కేటగిరీ సీట్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిషా, మధ్య ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేదు. గతేడాది నుంచి అన్ని సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా అక్కడి నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో ఒకవైపు రిజర్వేషన్ లేక సొంత రాష్ట్రంలో, మరో వైపు అవకాశం లేక ఇతర రాష్ట్రాల్లోని సీట్లు పొందలేక తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీన్ని గుర్తించి, అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడి విద్యార్థులకు లాభం చేకూరెలా తాజా నిర్ణయం తీసుకుంది.
రిజర్వేషన్ సాధన సమితి హర్షం...
స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్ల లోకల్ రిజర్వేషన్ సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సమితి అధ్యక్షులు దాసరి రవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి సతీష్, ముఖ్య సలహాదారు ఇ.చంద్రశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2017 నుంచి తాము చేస్తున్న పోరాటం ఫలించిందని పేర్కొన్నారు. జీవో జారీకి కృషి చేసిన మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.