Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండలో నిర్వహణ
- పోష్టర్ ఆవిష్కరించిన నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నవంబర్ 8,9,10 తేదీల్లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండొ మహాసభలు నల్లగొండ జిల్లాలో జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్ను గురువారం హైదరాబాద్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో నాయకులు ఆవిష్కరించారు. అనంతరం మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి. సాగర్, ఉపాధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ మహాసభలను పురస్కరించుకుని నవంబర్ 8న నల్లగొండ పట్టణంలో రైతుల భారీ ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. ఈ సభకు ఏఐకేఎస్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అశోక్ ధావలే, హన్నన్ మొల్ల, సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జూకృష్ణన్ పాల్గొంటారని వివరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. పెట్టుబడి ఖర్చుకు 50 శాతం కలిపి మద్దతు ధరలను నిర్ణయించాలనే స్వామినాథన్ సిఫారులను పట్టించుకోలేదని చెప్పారు. రైతులకు నష్టదాయకంగా పరిణమించనున్న విద్యుత్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో రైతుల రుణాలను రద్దు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని కోరారు. కేంద్ర మంత్రి అజరు మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలనీ, ఆయనపై హత్యానేరం మోపి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని అన్నారు. లక్షలోపు రుణాలన్నిటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ధరణిలో ఉన్న లోపాలను సవరించి పాస్ పుస్తకాలు రైతాంగానికి అందించాలనీ, అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన వారందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, కాసాని ఐలయ్య, కున్సొత్ ధర్మ, శెట్టి వెంకన్న, సహాయ కార్యదర్శులు కున్రెడ్డి నాగిరెడ్డి, మూడ్ శోభన్, మిల్కూరి వాసుదేవరెడ్డి, డి బాల్రెడ్డి, వెంకటేష్, కుమారస్వామి, శ్రీనివాసులు, గఫూర్ పాషా తదితరులు పాల్గొన్నారు.