Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్‌కు దీటుగా సర్కారు కాలేజీ విద్యార్థుల సత్తా: విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ఇంటర్లో అధిక మార్కులొచ్చిన విద్యార్థులకు ఆర్థిక చేయూత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదనీ, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అధ్యాపకులు చెప్పిన విషయాలను అనుసరించి సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివితే విజేతలుగా నిలుస్తారని అన్నారు. అందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి అత్యధికమార్కులతో సత్తా చాటిన విద్యార్థులే నిదర్శనమన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు-2022లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను గురువారం హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఉన్న ఆడిటోరియంలో సన్మానించారు. ఆర్థిక ప్రోత్సాహంతో చేయూతనందించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన విద్యను అందించడం వల్లే ఉత్తమ ఫలితాలు లభిస్తున్నాయని చెప్పారు. ప్రయివేట్ కళాశాలలకు దీటుగా పూర్తి స్థాయిలో విద్యార్థులకు సదుపాయాలను కల్పించామని అన్నారు. వాటిలో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వార్షిక పరీక్షలకు ముందు నుంచే విద్యార్థులను సిద్ధం చేస్తున్నామనీ, అవసరమైతే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఆదివాసీ ఖిల్లాగా పేరున్న కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడం ప్రశంశనీయమని అన్నారు. జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రత్యేకంగా సైకాలజిస్టులతో సలహాలను ఇప్పిస్తున్నామని చెప్పారు. ఐఐటీ, నీట్ ప్రవేశాల కోసం ఇంటర్ బోర్డు ఇచ్చిన శిక్షణ సైతం సత్ఫలితాలను సాధించిందన్నారు. పరీక్షలు సమీపించిన సమయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులను గ్రూప్‌లుగా విభజించి వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఓమర్ జలీల్, అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఇంటర్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.25 వేలు, కోర్సుల వారీగా టాపర్లుగా నిలిచిన 23 మందికి ఒక్కొక్కరికీ రూ.20 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించారు.
ప్రపంచంలో ఇంగ్లీష్...
భారత్‌లో హిందీ మాట్లాడతారు : సబిత
ప్రపంచంలో ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడితే భారతదేశంలో హిందీ అధికంగా మాట్లాడతారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో హిందీ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందీ బాషాభివృద్ధికి ప్రచార సభ చేస్తున్న కృషి ఎంతో గొప్పదని అన్నారు. సీఎం కేసీఆర్ కూడా హిందీ భాషకున్న ప్రాధాన్యతను పలు సందర్భాల్లో ప్రస్తావిస్తారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఉర్దూ-హిందీ మిళితం చేసి జనం మాట్లాడతారని అన్నారు. ఉత్తర భారతదేశంలో హిందీ ఎక్కువగా మాట్లాడతారనీ, దక్షిణ భారత్‌లోనూ హిందీ వికాసం జరగాలని సూచించారు.