Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపండి: వీసీకి మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాసర త్రిబుల్‌ఐటీలో పూర్తిస్థాయిలో సౌకర్యాలను, వసతులను మెరుగుపర్చాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి పంపాలని వైస్ చాన్స్‌లర్‌ను ఆమె ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో బాసర త్రిపుల్‌ఐటీ వైస్ చాన్స్‌లర్, డైరెక్టర్‌తో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు హామి ఇచ్చిన విధంగా సంతృప్తికర స్థాయిలో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వివరించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఇన్నోవేషన్ హబ్‌ను, ఆధునిక కంప్యూటర్లతో ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపితే వెంటనే ఆమోదం తెలుపుతామని మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను 45 రోజుల్లోగా నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మినీ స్టేడియం ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని గుర్తించి, నిర్మాణం కోసం సిద్ధం చేయాలని అధికారులను కోరారు. తరగతి గదుల ఆధునీకరణకు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలనూ సిద్ధం చేయాలని సూచించారు. మెస్, ఏకరూప దుస్తులు, ష్యూస్కు సంబంధించిన టెండర్ల ప్రక్రియను కొలిక్కి తేవాలని వివరించారు. భోజనశాలల్లోనూ, వంటగదుల్లోనూ అవసరమైన మరమ్మతులను పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాసర త్రిపుల్‌ఐటీ వైస్ చాన్స్‌లర్ వి వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.