Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశంసలు కురిపించిన ఒడిశా మంత్రి రీటా సాహూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం చేనేత, టెక్స్టైల్ రంగం అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని ఒడిశా చేనేత, జౌళి శాఖ మంత్రి రీటా సాహూ కొనియాడారు. తెలంగాణలో చేనేత రంగంపై పథకాల వివరాలతో కూడిన నివేదిక ఇస్తే తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఒడిశాలో పర్యటించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను సాదరంగా ఆహ్వానించారు. మంత్రి రీటాసాహు ఆధ్వర్యంలో ఒడిశా చేనేత, జౌళి శాఖ అధికారుల బృందం పోచంపల్లి, కొయ్యలగూడెంలోని చేనేత క్లస్టర్‌ను గురువారం సందర్శించింది. ఇక్కత్ పట్టు చీరలు, వాటి డిజైన్ల వివరాలను రీటా సాహు అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ చీరలను తయారు చేయడంలో చేనేత కార్మికుల నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. డబుల్ ఇక్కత్ ద్వారా తయారుచేస్తున్న బెడ్ షీట్లు, ఇతర ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఆ బృందం హైదరాబాద్‌లో మంత్రి కె.తారకరామారావుతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో నేతన్నల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. ఈ ఎనిమిదేండ్ల కాలంలో చేనేత రంగం అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు పెంచామన్నారు. నేతన్నలకు ఇచ్చే ముడిసరుకుపై సబ్సిడీలు ఇస్తున్నామనీ, నేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. పవర్లూమ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భాగంగా బతకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలు కానుక ఇచ్చేలా ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్న అపెరల్ పార్క్, ఇతర ప్రాంతాల్లో కల్పించిన మౌలిక వసతుల కల్పన గురించి వివరించారు.