Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవన్‌దాన్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అవయవమార్పిడి చికిత్స కోసం నాలుగు వేల మంది ఎదురు చూస్తున్నారని జీవన్‌దాన్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలత తెలిపారు. ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని సెంచురీ ఆస్పత్రిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండెమార్పిడి చేసుకుని ఐదేండ్లుగా ఆరోగ్యంగా జీవిస్తున్న బస్సు డ్రైవర్ లింగస్వామిని ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ జీవన్‌దాన్‌తో నాలుగు వేల మంది అవయవమార్పిడి చేసుకుని ఆయుష్షు పెంచుకున్నారని చెప్పారు. మరో నాలుగు వేల మంది అవయవదాతల కోసం వేచి ఉన్నారని తెలిపారు. అవయవాల డిమాండ్‌కు, వాటి లభ్యతకు మధ్య చాలా తేడా ఉందనీ, దాన్ని పూరించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవయవమార్పిడి చికిత్సలన్నింటికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. జీవన్‌దాన్ సహకారంతో 150 గుండె మార్పిడి చికిత్సలు జరిగాయని తెలిపారు. సెంచురీ ఆస్పత్రి చీఫ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ నందగిరి మాట్లాడుతూ, అవయవమార్పిడి చికిత్సల కోసం అన్ని ఆస్పత్రులను నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. డాక్టర్ స్వర్ణలత కృషితో అవయవమార్పిడి చికిత్సల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైస్‌చైర్మెన్ డాక్టర్ హేమంత్ కుమార్ కౌకుంట్ల, గుండెమార్పిడి చికిత్స చేసుకుని ఆరోగ్యంగా జీవిస్తున్న లింగస్వామి, డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.