Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో గతం, ప్రస్తుతాన్ని పోల్చాలి:
- చరిత్ర, సంస్కృతి, ఉద్యమం పుస్తకావిష్కరణలో సీఎస్ సోమేశ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆర్థిక, సామాజిక, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. తెలంగాణ గతం, ప్రస్తుతం ఉన్న అంశాలను పోల్చుతూ మరింత పరిశోధనాత్మక రచనలు వెలువడాల్సిన అవసరముందని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్‌లోని ఆయన కార్యాలయంలో ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, డాక్టర్ ద్యావనవెళ్లి సత్యనారాయణ రాసిన 'తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమం'అనే పుస్తకాన్ని సోమేశ్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి మూల, మూలకు చరిత్ర ఉంటుందనీ, సీఎం కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారని వివరించారు. ఈ గ్రంధంలోని చారిత్రకాంశాలను చూస్తే ఇది మరోసారి నిరూపిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రను రెండు వేల ఏండ్ల క్రితం నుంచి ప్రారంభమైందంటూ చెప్తూ వస్తున్నారనీ, కానీ ఈ భూభాగంలో 18 లక్షల ఏండ్ల క్రితం నుంచే ఆది మానవులు ఎదుగుతూ వచ్చారన్న విషయాన్ని చరిత్ర చెప్తున్నదని వివరించారు. ఆ పరిణామ క్రమంతోపాటు ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల చరిత్రను సమగ్రంగా విశ్లేషిస్తూ 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాల'ను ప్రత్యేకంగా వివరిస్తూ రచయితలు ఆంగ్లంలో 'తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూవ్మెంట్' అనే గ్రంథాన్ని రయడాన్ని సోమేశ్ కుమార్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇక్కడి చరిత్ర, సంస్కృతి, సామాజిక వ్యవస్థను విశ్లేషిస్త్తూ పెద్ద ఎత్తున సాహిత్యం పుస్తకరూపంలో వస్తున్నప్పటికీ, ఇది మరింత ఎక్కువగా రావాల్సిన అవసరముందని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 90 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కాంపిటీటివ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ గ్రంధం ఉపయోగపడుతుందని వివరించారు. తెలంగాణా చరిత్రను వక్రీకరించేలా పలు సినిమాలు వస్తున్నాయనీ, ఇదే కోవలో మరిన్ని వచ్చే అవకాశముందని మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ అన్నారు. సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల చరిత్రకారులకు వారి రాష్ట్ర చరిత్ర రచనకు ఈ గ్రంధం ప్రామాణికంగా ఉపయోగ పడుతుందని చెప్పారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మెన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను సాధికారికంగా తెలిపే ఈ గ్రంధాన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ అధికారులకూ పంపడంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని టూరిజం స్టాళ్లలోనూ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పబ్లికేషన్స్ కార్యదర్శి చంద్రమోహన్ తదితరులు హాజరయ్యారు.