Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ
- ఎస్వీకేలో సామాజిక ఉద్యమ శిక్షణా తరగతులు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్ రాష్ట్ర సామాజిక ఉద్యమ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్ల కాలంలో అనుసరించిన విధానాల మూలంగా రాజ్యాంగ మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, లౌకికతత్వం వంటి వాటిని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ అనుసరిస్తున్న మనువాద విధానాలతో భారత రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు ప్రమాదం పొంచి ఉందన్నారు. తద్వారా సామాజిక న్యాయం సమాధి చేయబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 300 రెట్లు దళితులు, మహిళలపై హింస పెరిగిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు ఒక్కొక్కటిగా అమ్ముతూ కార్పొరేట్లకు ఎర్ర తివాచీపరిచి కష్టజీవులకు కడగండ్లు మిగుల్చుతున్నదని విమర్శించారు. రాష్ట్రపతులుగా దళిత, గిరిజనులను బొమ్మలుగా రాజ్యాంగం వారికి కల్పించిన అన్ని రకాల హక్కులకు భంగం కలిగిస్తున్నదని అన్నారు. కేవీపీఎస్ దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా దళిత, గిరిజన, బలహీన వర్గాలను ఐక్యం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ ఢిల్లీ ప్రభుత్వం 300 యూనిట్ల వరకు దళితులకు ఉచిత కరెంటు ఇస్తున్నదని వివరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దళితులకు ఉచిత విద్యుత్ కోసం దశల వారీ పోరాటాలను నిర్మిస్తామన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో అత్యంత నిరుపేద విద్యార్థులు అరకొర సౌకర్యాలతో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవ తీసుకుని మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేవీపీఎస్ సర్వేలు నిర్వహించిందన్నారు. 'వర్తమాన రాజకీయ పరిస్థితులు' అనే అంశంపై అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, 'మతోన్మాదం-ప్రతిఘటన పద్ధతులు' అనే అంశంపై ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ బోధించారు. కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున ప్రిన్సిపల్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.