Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలక్షన్ నోటిఫికేషన్‌కు ముందే సమస్యలు పరిష్కరించండి
- మునుగోడు ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు కే రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం అక్టోబర్ 9న చలో మునుగోడు ఆందోళనా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గురువారం మునుగోడు మండలంలోని ఆర్టీసీ ఉద్యోగుల సమావేశానికి రిటైర్డ్, సర్వీసులో ఉన్నవారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ఆర్టీసీలోని 47 వేల మంది కనిపించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రిపై కార్మికులు పెట్టుకున్న విశ్వాసం, నమ్మకాన్ని వమ్ముచేయోద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను రద్దుచేసి, రాజ్యంగం ప్రకారం యూనియన్ కార్యకలాపాలను అనుమతించాలని కోరారు. కార్మికుల సుదీర్ఘకాల డిమాండ్లను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 2013 వేతన సవరణకు సంబంధించిన 50 శాతం బకాయిల బాండ్స్ కాల పరిమితి ముగిసి ఐదేండ్లు అయినందున వాటిపై 8.75 శాతం వడ్డీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 9న జరిగే ''చలో మునుగోడు'' కార్యక్రమానికి నియోజకవర్గంలోని మండలాల నుంచి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమాఖ్య సలహాదారు బీజేఎమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీఏ చారి, ఉపాధ్యక్షులు శంకరయ్య, కత్తుల యాదయ్య, జాయింట్ సెక్రటరీ కొవ్వూరు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.