Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలి... టిప్స్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియట్ విద్యలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఏసీబీ విచారణకు ఆదేశించాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) డిమాండ్ చేసింది. ఈ మేరకు టిప్స్ కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, సమన్వయకర్త ఎం జంగయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఉద్యోగ విరమణ పొందుతున్న సమయంలో అక్రమ ఓడీలు, ఎయిడెడ్ కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అక్రమ పదోన్నతులు, అక్రమంగా తిరిగి నియామకం చేయడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వాహనాన్ని షోరూంలో కాకుండా ఇతర చోట సర్వీసింగ్ చేయించి డమ్మీ బిల్లులతో దాదాపు రూ.రెండు లక్షలు ఖర్చు చేశారని తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సాధారణ ఏర్పాట్లకు దాదాపు రూ.2.20 లక్షలు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డులో ఉన్న అధికారులు పరీక్షలు, అడ్మిషన్లు వంటి విద్యార్థుల పనులు చేయడానికే ఉంటారనీ, కానీ విచ్చలవిడిగా రెమ్యూనరేషన్, ఓటీ, ఇతర అలవెన్సుల పేరుతో రూ.లక్షలు తీసుకుంటూ బోర్డును దివాళా తీస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ, నిరుపేద విద్యార్థులపై ఎలాంటి బాధ్యతగా వ్యవరించని బోర్డు కార్యదర్శి అర్హులకు కాకుండా అనర్హులకు అక్రమంగా ఓడీలు, డిప్యూటేషన్లు కట్టబెట్టారని తెలిపారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు తిరిగి వారిని గతంలో పనిచేసిన కాలేజీకి కేటాయించారనీ, కాంట్రాక్టు అధ్యాపకులను బదిలీ చేశారని పేర్కొన్నారు. కొంత మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలను అక్రమంగా రద్దు చేశారని తెలిపారు. ఇంటర్ విద్యను కాపాడాలని కోరారు.