Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముప్పు లేదంటున్న కేంద్రం తీరుపై సర్వత్రా ఆగ్రహం
- బ్యాక్‌వాటర్‌తో ముంపు
- కొత్తగూడెం జిల్లాలో 92 గ్రామాల మునక తప్పదు
- లక్ష మందికి పైగా నిర్వాసితులయ్యే ప్రమాదం
- పోలవరంలో 38 మీటర్ల నీరు నిల్వనప్పుడు మునిగాయా?!: సీపీఐ(ఎం)
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోలవరం బ్యాక్‌వాటర్‌తో ముంపు ముప్పు లేదంటున్న కేంద్రం వాదనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాక్ వాటర్‌తో కచ్చితంగా ముంపు ముప్పేనని... మొన్నటి వరదలతోనైనా కేంద్రం కండ్లు తెరుచుకోలేదా అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ముంపు ప్రభావిత ప్రాంత వాసులు మండిపడుతున్నారు. ఎలాంటి అధ్యయనం చేయకుండా ముప్పులేదంటున్న కేంద్ర జలశక్తి శాఖ తీరుపై సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం జిల్లాలోని 92 గ్రామాలకు ముంపు తప్పదని, లక్ష మంది వరకూ నిర్వాసితులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పోలవరంలో 38 మీటర్ల నీరు నిల్వనప్పుడు ఈ ప్రాంతానికి ఏమైనా ముప్పు వాటిల్లిందా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర జల్ శక్తి ఆధ్వర్యంలో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగునీటి పారుదల శాఖల అధికారులతో గురువారం సమావేశం జరిగింది. దీనిలో పోలవరం పూర్తయితే భద్రాచలానికి ముప్పే లేదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వెలువరించిన అభిప్రాయంపై ముంపు ప్రభావిత ప్రాంతవాసులు మండిపడుతున్న నేపథ్యంలో 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..
1986 కన్నా తక్కువ వరద వచ్చినా ఎక్కువ నష్టం..
పోలవరం ప్రాజెక్టుకు 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణలోని 74 గ్రామాలు, అదే 52 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే 92 గ్రామాలు మునుగుతాయని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 1.2 లక్షల మంది నిర్వాసితులయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల వరదలకు 24.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే అశ్వాపురంలో 18 గ్రామాలు, భద్రాచలంలో 5, బూర్గంపాడులో 12, చర్లలో 28, దుమ్ముగూడెంలో 25, పినపాకలో 11 గ్రామాలు కలుపుకుని మొత్తం 99 ఊళ్లు ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లోని 27వేల కుటుంబాలకు 12,594 కుటుంబాలు ముంపు బారినపడ్డాయి. 1986లో గోదావరికి అత్యధికంగా 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది.
ఆ సమయంలో వచ్చిన ముంపు కన్నా ఇప్పుడు తక్కువగా 24.50 లక్షల క్యూసెక్కులు మాత్రమే వచ్చింది. కానీ అధిక ప్రభావం పడింది. బగ్గు గనులపైనా ప్రభావం పడింది.
పోలవరంలో 150 అడుగుల నీరుంటే భద్రాద్రిలో నిత్యం ముంపే..
ఇప్పటి వరకూ 38 లక్షల క్యూసెక్కుల వరదపైనే అధ్యయనం కొనసాగింది. భద్రాచలం వద్ద రివర్ బెడ్ 107 అడుగులుగా ఉంది. పోలవరంలో కనీస నీటిమట్టం 135 అడుగుల వద్ద ఉన్న సమయంలో భద్రాచలంలో 28 అడుగుల వరకూ నీళ్లుంటాయి. అదే పోలవరంలో 150 అడుగుల నీటిమట్టం ఉంటే భద్రాచలంలో నిరంతరం 43 అడుగుల మేర నీళ్లుంటాయి. నిత్యం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరిలో స్థానికంగా కలిసే నదులపై కూడా పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం ఉంటుందని భద్రాద్రి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పాల్వంచ, కొత్తగూడెం సమీపంలోని కిన్నెరసాని, ముర్రేడువాగులు సజావుగా సాగకుండా పోలవరం బ్యాక్‌వాటర్ అడ్డుపడుతుందని దీనివల్ల స్పిల్ ఓవరై పరిసర ప్రాంతాలు నీటమునుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఉపద్రవాలను తెలంగాణ ముఖ్యంగా భద్రాచలం పరిసరాలు చవిచూడాల్సి వస్తున్నా.. కేంద్రం అవగాహన రాహిత్య వాదనలు చేస్తుండటాన్ని సీపీఐ(ఎం) ఖండించింది.
ఓవైపు నష్టమంటూ... మరోవైపు లేదంటూ...
పోలవరం ప్రాజెక్టు వల్ల తమకు నష్టం వాటిల్లు తుందని ముంపు ప్రభావిత రాష్ట్రాల ఆందోళన వాస్తవమేనంటూనే కేంద్రం మరోవైపు ముప్పులేదనడం హాస్యాస్పదంగా ఉంది. సమ స్యను పక్కదోవ పట్టించేం దుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. బ్యాక్‌వాటర్‌పై సమగ్ర అధ్య యనం చేయకుండానే ఇష్టానుసారంగా వ్యవహరి స్తోంది. మొన్నటి వరదల్లో నిపుణుల అంచనా కన్నా ఎక్కువ నష్టం జరిగింది. భద్రాచలానికి 130 కి.మీ దూరంలో ఉన్న పేరూరు దగ్గర నుంచి వచ్చిన వరద నీటివల్ల ఆరేడు వేల హెక్టార్ల మిర్చి తోటలు నీటముని గాయి. ఇవన్నీ బ్యాక్‌వాటర్ ప్రభావమే. కానీ కేంద్ర నిపుణులు పోలవరం ప్రభావం కాదంటున్నారు. బ్యాక్‌వాటర్‌పై అధ్యయనం చేయకుండా దబాయించి మాట్లాడుతున్నారు. పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయకుండా కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే ఇస్తామనడం సముచితం కాదు. 38 మీటర్ల ఎత్తులో అప్పర్ కాపర్ డ్యామ్‌లో మాత్రమే మొన్నటి వరదలకు నీరు నిల్చున్నాయి. 41.15 మీటర్ల ఎత్తులో నీళ్లను ఆపడానికి కావాల్సిన డ్యామ్ మాత్రమే పూర్తయింది. డెత్ కం రాక్‌ఫిల్ డ్యాం పూర్తయితే పరిస్థితి ఏంటి? ఇది ఒక జలవనరుల శాఖతోనే ముడిపడిలేదు. మొత్తం 11 శాఖలను సమన్వయం చేసి, పుణె, డెహ్రాడూన్‌లోని ప్రత్యేక నీటిపారుదల ఇంజినీరింగ్ నిపుణులతో అధ్యయనం చేసి, ముంపు రాష్ట్రాలతో చర్చించి దీనిపై ఓ నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.
- డాక్టర్ మిడియం బాబూరావు, మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు