Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వావలంబన, సామాజిక న్యాయం, లౌకిక ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థలకు పెనుముప్పు : కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ సభలో సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
నాటి రాజకీయ విలువలకు నేడు తూట్లు
- సమ సమాజం.. మానవతావాదం మన లక్ష్యం కావాలి
- ప్రజాస్వామ్యాన్ని పున:స్థాపిద్దాం
- జైపాల్‌రెడ్డి ఒక రాజకీయ ఆలోచనాపరుడు
- నేనూ.. ఆయనా కలిసి కేంద్రంలో మూడు ప్రభుత్వాలను ఏర్పాటు చేయించాం
- ఇద్దరమూ కలిసే సీఎంపీని రచించాం
- ప్రస్తుత సంక్షుభిత పరిస్థితుల్లో ఆయన లేకపోవటం తీరని నష్టం
- దేశాన్ని సరైన మార్గంలో పెట్టటమే నిజమైన నివాళి :
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ సభలో సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మన దేశానికి అతి కీలకమైన ఆర్థిక స్వావలంబన.. సామాజిక న్యాయం..లౌకిక ప్రజాస్వామ్యం.. సమాఖ్య వ్యవస్థ అనే నాలుగు ప్రధానాంశాలకు నేడు పెను ముప్పు వాటిల్లుతున్నదని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నాలుగిం టిని మనం కాపాడుకోలేకపోతే ఈ దేశం మిగలదని ఆయన హెచ్చరిం చారు. గతంలో రాజకీయ నాయకులకు ప్రజల పట్ల అంకిత భావం, నిబద్ధత, సేవా తత్పరత ఉండేవని గుర్తు చేశారు. ఏ పార్టీలో ఉన్నా నైతిక విలువలకు పెద్ద పీట వేస్తూ వారు రాజకీయాలు నెరిపేవారని తెలిపారు. ఇప్పుడు అలాంటి విలువలకు తిలోదకాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జైపాల్‌రెడ్డి లాంటి నేత గురించి మాట్లాడు కోవటమంటే వాటిని మరోసారి గుర్తు చేసుకోవటం, వాటికి పునరంకితమవుతామంటూ ప్రతిన బూనట మేనని అన్నా రు. దేశం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతు న్న ప్రస్తుత తరుణంలో జైపాల్‌రెడ్డి లాంటి వారు లేకపోవ టం మనకు నష్టదాయకమని ఏచూరి వ్యాఖ్యానిం చారు. సమానత్వం, అంతరాల్లేని సమాజం కోసం కమ్యూనిస్టులు గా తాము అవిశ్రాంత పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో కుల,మత, భాష, లింగ బేధం లేని భారతా వనిని నిర్మించేందుకు మనందరం కంకణబద్ధులం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల మధ్య చీలికలు తెచ్చి... దేశాన్ని వక్రమార్గంలో పాలిస్తున్న వారి ఆటలను సాగనీయ రాదని, అదే జైపాల్‌రెడ్డికి నిజమైన నివాళని తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహా విష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏచూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఆర్.కృష్ణయ్య, పి.రాములు, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కె.నారాయణరెడ్డి, సీపీఐ నేత అజీజ్‌పాషా, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు, ఆంధ్రా మేధావుల ఫోరం నేత చలసాని ప్రసాదరావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏచూరి ప్రసంగిస్తూ... జైపాల్‌రెడ్డితో వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ తనకున్న బంధాన్ని, అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో తనకున్న ఆత్మీయతను సభికులతో పంచు కున్నారు. ఒకానొక దశలో 'జైపాలన్న...' అని సంబోధిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. సీపీఐ (ఎం) నేతగా, పార్ల మెంటరీ పార్టీ నేతగా తాను, కేంద్ర మంత్రిగా జైపాల్‌రెడ్డి అనేక సందర్భాల్లో పలు విషయాలపై చర్చోపచర్చలు జరిపేవారమని తెలిపారు. ఆయన పార్లమెంటులో ఆంగ్లంలో మాట్లాడితే... పదాలకు అర్ధాలు దొరక్క అనేక మంది సభ్యులు డిక్షనరీలు వెతుక్కునేవారని చెబుతూ ...జైపాల్‌రెడ్డి వాడిన 'హ్యూమాంగస్ (అతి పెద్ద)' అనే పదాన్ని ఉదహరించారు. 'నేనూ.. జైపాల్‌రెడ్డి గారు కలిసి మొత్తం మూడు ప్రభుత్వాలను (ఐకే గుజ్రాల్, దేవగౌడ, మన్మోహన్ సింగ్) దగ్గరుండి ఏర్పాటు చేయించాం.. వాటిని కాపాడుకోవటం కోసం తీవ్రంగా కృషి చేశాం... వాటిలో కొన్ని కూలిపోతున్నప్పుడు కూడా అలాగే చూస్తూ ఉండిపోయాం...' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏ-1 సమయంలో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ (సీఎంపీ) రాయటంలో తనతోపాటు చిదంబరం, జైపాల్‌రెడ్డి పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో అంతటి క్రియాశీలక పాత్ర పోషించిన ఆయన ఒక రాజకీయ సూత్రధారుడు, రాజకీయ ఆలోచనా పరుడంటూ ఏచూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తన మేధాశక్తితో దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతిభాశాలి అని నివాళులర్పించారు.
జైపాల్‌రెడ్డి లౌకికవాదం, మానవతావాదాన్ని గొప్పగా ప్రేమించేవారని ఆయన తెలిపారు. తుదికంటా సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి పని చేశారని చెప్పారు. ఒకానొక సందర్భంలో ఆయన పార్టీ మారారంటూ సెటైర్లు విసిరితే... 'నా పార్టీ సిద్ధాంతాన్ని వదిలేసింది. అందుకే నేను దాన్ని వదిలేశా. అంతేతప్ప విలువల్ని వదులు కోలేను...' అంటూ జవాబిచ్చారని వివరించారు. ప్రస్తుతం దేశంలో అలాంటి రాజకీయ విలువలు నానాటికీ దిగజారి పోతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విలువలను తిరిగి పాదుకొల్పటమే మనముందున్న ప్రధాన లక్ష్యమని తెలిపారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలపై దాడులు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో... వారి అండగా నిలబడటం, రాజ్యాంగాన్ని రక్షించటం, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించ టమనే కర్తవ్యాలను ప్రజలందరూ భుజానికెత్తుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
అప్పుడే జైపాల్‌రెడ్డికి నిజమైన నివాళి అర్పించినవారమవుతా మని అన్నారు. విగ్రహా విష్కరణకు తనను ఆహ్వానించిన జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఏచూరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. జస్టిస్ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ... జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని చూసినప్పుడు ఆయన పాటించిన విలువలు గుర్తుకొచ్చాయని తెలిపారు. 'రాజకీయాలు డబ్బు కోసం కాదు.. రాజకీయాలు ప్రజా సేవ కోసం...' అని నమ్మిన గొప్ప నాయకుడు జైపాల్‌రెడ్డి..' అని నివాళులర్పించారు. గుత్తా మాట్లాడుతూ... జైపాల్‌రెడ్డి స్థాయిలో రాజకీయాల్లో ఉన్నత విలువలను పాటించ లేకపోయినా... ఆయన్ను చూసి ఎంతో కొంత నేర్చుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు. ఆ విలువలు నేటి తరానికి ఆదర్శనీయమని చెప్పారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... 12 నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనీ, అప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకి జైపాల్‌రెడ్డి పేరును పెడతామని తెలిపారు. ఆ ప్రాజెక్టును ఆమోదింపజేయటం, నిధులు కేటాయించటంలో కేంద్ర మంత్రిగా ఆయన క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పారు. కల్వకుర్తి ప్రాంతానికి కరెంటు, ఎత్తి పోతల పథకాలను పరిచయం చేసింది ఆయనేనని చెప్పారు. 'జైపాల్‌రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక మంది నాయకులకు తయారు చేసిన రాజకీయ ఖార్ఖానా...' అంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ రాములు మాట్లాడుతూ... పార్లమెంటులో జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టింపజేయాలని డిమాండ్ చేశారు. అజీజ్ పాషా మాట్లాడుతూ... కేజీ బేసిన్ గ్యాస్ వ్యవహారంలో గందరగోళం చోటు చేసుకున్నప్పుడు కేంద్ర మంత్రిగా రిలయన్స్ కంపెనీకి సైతం పెనాల్టీ విధించిన గొప్ప ధైర్యవంతుడు జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. సమాచార, ప్రసారశాఖ మంత్రిగా అనేక విప్లవాత్మక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు మందా జగన్నాథం, మల్లు రవి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి.ఆచారితోపాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు, అభిమానులు, జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాడ్గుల మండల సీపీఐ (ఎం) నాయకులు జగన్ తదితరులు ఏచూరిని సన్మానించారు.