Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైటీడీఏకు 2157 ఎకరాలు కేటాయింపు
- 100 ఎకరాల్లో నరసింహ అభయారణ్యం
- ఆలయ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు
- వైటీడీఏ వెలుపల విలేకరులకు ఇండ్ల స్థలాలు
- వైటీడీఏ సమీక్షలో సీఎం కేసీఆర్
- లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం దంపతులు
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి లకిë నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తక్షణం రూ.43 కోట్లు కేటాయిస్తామని, 2157 ఎకరాలను రెవెన్యూ శాఖ అప్పగిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. వైటీడీఏ పరిధిలోని 100 ఎకరాల అడవిని నృసింహ అభయారణ్యం పేరిట అద్భుతంగా తీర్చిదిద్దాలని,స్వామివారి నిత్య పూజలు, కల్యాణం, అర్చనలకు అవసరమైన పూలు,పత్రాలు ఆ అరణ్యంలోనే పెంచాలని అధికారులను ఆదేశించారు. మరో 50 ఎకరాల్లో అమ్మవారి పేరున అద్భుతమైన కల్యాణ మండప నిర్మాణం చేపట్టా లన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలతోపాటు దివ్య విమాన రాజగోపురం తాపడానికి సీఎం మనవడు హిమాన్షు కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించారు. అనంతరం సీఎం వైటీడీఏ అధికారులతో కొండ కింద ప్రెసిడెన్షియల్ సూట్లో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వైటీడీఏకు 2157 ఎకరాల భూమిని రెవెన్యూశాఖ పూర్తిస్థాయిలో అప్పగిస్తుందని, దాని నిర్వహణ వైటీడీఏ అధికారులు చేపట్టాలని సీఎం చెప్పారు. గుట్ట అభివృద్ధికి రూ.43 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఫోన్లో ఆదేశించారు. ఈ భూమిలో ఆలయ అవసరాలు, పోలీసుశాఖ, ఫైర్ స్టేషన్, హెల్త్, రవాణా, పార్కింగ్ వంటి అభివృద్ధికి అనుబంధ సేవల కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. అర్చకులకు, సిబ్బందికి కూడా ఇందులోనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక విలేకరులకు వైటీడీఏ బయట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు కేటాయించి, పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దాతల విరాళాలకు సంబంధించి ఆదాయ పన్ను మినహా యింపునకు 80జి అనుమతులు వెంటనే తీసుకోవాలని అధికారులకు సూచించారు. హెలీపాడ్ల నిర్మాణం కూడా చేపట్టాలన్నారు. వైటీడీఏ సమీపంలో జరిగే ప్రయివేటు నిర్మాణాలకు సంబంధించి జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలన్నారు. దీక్షాపరుల మంటపం, వ్రత మంటపం, ఆర్టీసీ బస్టాండు, స్టామ్ వాటర్ డ్రయిన్ల నిర్మాణంలో కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు.250 ఎకరాల్లో నిర్మించే 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా నిర్మించాలని, వాటికి ప్రహ్లాద, యాద మహర్షి వంటి ఆలయ చరిత్ర గల పేర్లు పెట్టాలని సూచించారు. ఆలయ ఆదాయ వ్యయాల ఆడిటింగ్ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ, ఆలయ నిర్వహణ కోసం నిధులు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రముఖుల విరాళాలు
గుడి విమాన గోపురం కోసం బంగారు తాపడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (కిలో బంగారం) రూ.50 లక్షల 15 వేల చెక్కు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేంరెడ్డి నర్సింహరెడ్డి (కిలో బంగారం) రూ.51 లక్షల చెక్కు, ఏనుగు దయానంద రెడ్డి (కిలో బంగారం) రూ.50 లక్షల 4 వేల చెక్కును అధికారులకు అందజేశారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, సీఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, యాదాద్రి ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మెన్ కిషన్ రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.
సీఎం పర్యటనలో అరెస్టులు
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటన సందర్భంగా పలువురిని అరెస్టు చేశారు. రోడ్డు మార్గంలో వస్తున్న సీఎంకు తమ గోడు వెళ్లబోసుకునేందుకు రాయగిరి వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులను పోలీసులు అరెస్టు చేశారు. గుడి ఓపెనింగ్ నుంచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆటో కార్మికులను తెల్లవారు జామునే అరెస్టు చేశారు. అదేవిధంగా మూడు గంటలపాటు సాగిన సీఎం పర్యటన సందర్భంగా దర్శనానికి ఎవరినీ అనుమతించలేదు. కొండపైకి వెళ్లిన మీడియా ప్రతినిధులను క్యూలైన్లోనే నిర్బంధించారు.