Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నంగునూరు
పాలమాకుల గ్రామ శివారులో బాణాసంచా గోడౌన్ వద్దని తాము అడ్డుకుంటే, అనుమతి ఇవ్వాలని గ్రామ పంచాయతీ ఎలా తీర్మానం చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని 328 సర్వే నంబర్లో భూమి కొనుగోలు చేసిన ఓ వ్యక్తి గోడౌన్ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా పేలుడు పదార్థాల గోడౌన్ నిర్మిస్తున్నారని రైతులు అభ్యంతరం తెలిపారు. గురువారం గ్రామసభ నిర్వహించి తీర్మానం చేయడంతో పాటు సంతకాలు సేకరించారని తెలుసుకున్న రైతులు శుక్రవారం పంచాయతీ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో పేలుడు పదార్థాల గోడౌన్‌కు ఎలా అనుమతి ఇస్తారని సర్పంచ్ కుమారస్వామిని రైతులు నిలదీశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అక్కడే ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జి ఎంపీడీఓ వేణుగోపాల్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పూర్తి వివరాలు తెలుసుకొని గ్రామపంచాయతీ తీర్మానం రద్దు చేయడంతో పాటు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.