Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ అధికారులు స్థలం పంచాయితీ తేల్చాలి: తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రజకులకు భద్రత కల్పించాలని, వారి స్థలం వారికి దక్కెలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అమనగల్ మున్సిపాలిటీ పరిధిలో చాకలి ఐలమ్మ విగ్రహం విషయంలో పద్మశాలీ, రజకుల మధ్య గురువారం ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠిచార్జీ చేశారు. ఈ ఘటనలో గాయాల పాలైన రజక కుటుంబాలను శుక్రవారం ఆశయ్య పరామర్శించారు. స్థానికంగా నెలకొన్న భూ వివాదంపై సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో మాట్లడారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు వినతి పత్రం అందజేశారు. తక్షణం గ్రామంలో ఇరువురి మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇరు సామాజిక తరగతుల మధ్య ఘర్షణ వాతవరణం నెలకొందన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రజకుల భూ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజకులు తమ సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న వీరనారి ఐలమ్మ విగ్రహం కూల్చటానికి దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను సామరస్యంగా పరిష్కరించి రజకులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట్ల శ్రీనివాస్, బీజేపీ రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ కొన్నే సంపత్, రజక సంఘాల చర్చావేదిక నాయకులు బాలాపూర్ బాలరాజు, అఖిల భారత రజక సంఘం అధ్యక్షులు మొగ్గ అనిల్, తదితరులు పాల్గొన్నారు.