Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీశాఖ సహకారంతో 4 ఎకరాల్లో ఏర్పాటు
- ఈ ఏడాది 73 శాతం సీట్లు అమ్మాయిలకే
- ల్యాప్‌టాప్‌ల కోసం ప్రభుత్వానికి నివేదించాం : ఆర్జీయూకేటీ వీసీ వెంకటరమణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అటవీ శాఖ సహకారంతో బాసర త్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో ఎకోపార్క్‌ను నాలుగు ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) వీసీ వి వెంకటరమణ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఎకోపార్క్‌లో వివిధ రకాల ఔషధ మొక్కలతోపాటు పండ్లు, పూలు తదితర మొక్కలను నాటుతామని అన్నారు. వర్సిటీ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతామని వివరించారు. మంత్రులు కేటీ రామారావు, పి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల తమ వర్సిటీని సందర్శించిన తర్వాత విద్యార్థులు, అధ్యాపకుల్లో మార్పు వచ్చిందన్నారు. విద్యార్థులు చెప్పిన సమస్యలు పరిష్కారమవుతాయన్న విశ్వాసం అందరిలోనూ కలిగిందని చెప్పారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 73 శాతం సీట్లు అమ్మాయిలకే వచ్చాయని వివరించారు. ఈనెల రెండున గాంధీ జయంతి సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో రెండువేల మంది విద్యార్థులతో శ్రమదానం చేస్తామన్నారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేస్తామని అన్నారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ కోసం పరిపాలనా అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తుందన్నారు. ఆర్జీయూకేటీలో ఇంటర్ పూర్తయి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేస్తామని వివరించారు. వర్సిటీ పరిపాలనకు సంబంధించిన ఆన్లైన్ సేవలు ఇచ్చేందుకు వీసీ డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేశామని చెప్పారు. దీని ద్వారా ఆన్లైన్ సేవలన్నీ కేంద్రీకృతం చేసి వెంటనే నిర్ణయం వచ్చేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. పరిపాలన, అకడమిక్, పరీక్షలకు సంబంధించిన సర్వీసులు ఈ డ్యాష్‌బోర్డులో ఉంటాయన్నారు. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎస్ఐఎస్), ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఈఐఎస్), బయోమెట్రిక్ అటెండెన్స్ మేనేజ్మెంట్ అప్లికేషన్ (బామా), లీవ్ మేనేజ్మెంట్ సిస్టం (ఎల్ఎంఎస్), ఔట్‌పాస్ మేనేజ్మెంట్ సిస్టం (ఓఎంఎస్), ఫీజు మేనేజ్మెంట్ సిస్టం (ఎఫ్ఎంఎస్), కన్సర్న్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎంఎస్), స్టూడెంట్ నోడ్యూస్ సర్టిఫికెట్ (ఎస్ఎన్డీసీ), పేస్లిప్పులు, వార్తలు, ఈ నోటీసులు ఉంటాయని వివరించారు. సమగ్ర జాబితా, స్టోర్ మేనేజ్మెంట్, ఫైల్ ట్రాకింగ్ సిస్టం (ఈఆఫీస్), మానవ వనరుల కేంద్రం, ఉద్యోగుల ధ్రువపత్రాలు, డాక్యుమెంట్ల మేనేజ్మెంట్, అతిధి గృహం, కాన్ఫరెన్స్ హాల్, ఆడిటోరియం, యోగా హాల్‌కు సంబంధించిన ఇండెంట్ అప్లికేషన్ మేనేజ్మెంట్ సిస్టంను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని వివరించారు.