Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమీషనర్‌కు కేవీపీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాంఘీక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారనీ, వాటిని తక్షణమే పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేవీపీఎస్ బృందం శుక్రవారం సాంఘీక సంక్షేమ హాస్టళ్ల అడిషనల్ కమిషనర్ ఉమాదేవికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న సంక్షేమ హాస్టళ్లను కేవీపీఎస్ కార్యకర్తలు సర్వేచేశారని తెలిపారు. విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలు ఏ మాత్రం సరిపోవటం లేదనీ, పెరిగిన ధరలకనుగుణంగా వాటిని పెంచాల్సిన అవసరముందని కోరారు.
మెస్ చార్జీలను రూ.1150 నుంచి రూ.2000 వరకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాస్మోటిక్ చార్జీలు రూ.62 నుంచి, రూ.200, బాలికలకు రూ.300,వరకు పెంచాలనీ కోరారు. హెచ్ఎంఎస్ హాస్టళ్లలో సొంత భవనాలు మంజూరు చేయాలనీ,విద్యార్థులకు ప్యాకెట్ మనీ రూ.500నుంచి రూ.1000 పెంచాలని కోరారు. బిల్లులు చేసే అధికారం స్థానిక వార్డెన్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్ఎంఎస్ హాస్టల్ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులందరికీ చెప్పులు, బూట్లు, స్టడీ మెటీరియల్స్, బ్యాగులు పూర్తిస్థాయిలో అందించాలని విజ్ఞప్తి చేశారు. పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ వెంటనే అందజేయాలని కోరారు. కొత్తగా చేరిన విద్యార్దినీ, విద్యార్థులకు పెట్టెలు, చెప్పులు, చెద్దర్లు, బూట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. మెరుగైన మంచి భోజనం అందాలంటే ముడిబియ్యం సరఫరా చేయాలని కోరారు. హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికులకు రెగ్యులర్ జీతాలు ఇవ్వాలనీ, థర్డ్ పార్టీ విధానం రద్దు చేయాలనీ, ఖాళీ పోస్టులు భర్తీ చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా హాస్టళ్ళల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలనీ, ప్రతి హాస్టల్లో ఒక ఏ ఎన్ ఎం ను నియమించాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కురుమయ్య, బోడ సామెల్,అతిమెల మానిక్ ,టంకరి రాములు తదితరులు పాల్గొన్నారు.