Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాకూ మినహాయింపు లేదు
- సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సరళీకృత నూతన ఆర్థిక వ్యవస్థలో నైతిక విలువలకు స్థానం లేకుండా పోయిందని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలువల పతనంలో మీడియాకు ఎలాంటి మినహాయింపు లేదన్నారు. వార్తా కథనాల్లో విశ్వసనీయత తగ్గుతున్నదనీ, నిజాలు రాయాలనే సామాజిక బాధ్యత జర్నలిస్టులకు ఉన్నా, ఆయా సంస్థల యాజమాన్యాలు దానికి అంగీకరించ ట్లేదని స్పష్టం చేశారు. శుక్రవారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 10వ జాతీయ మహాసభల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్య్లూజే) ఆధ్వర్యంలో 'ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా - నైతిక ప్రమాణాలు'' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికాయన ముఖ్యఅతిథిగా హాజరై, కీలకోపన్యాసం చేశారు. మీడియాలో వార్తలు పాలకులను మెప్పించడానికే పరిమితమవుతున్నాయనీ, ప్రజలు, వారి కష్టాల పక్షాన నిలిచేందుకు ఆసక్తి చూపట్లేదని విమర్శించారు. పాలకులతో కలిసిపోయి ఉండటం తప్పుకాదనే ధోరణిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారనీ, దీనివల్ల సమాజానికి నష్టం తప్పదని అభిప్రాయపడ్డారు. రైతుల ఆత్మహత్యలు లోపలి పేజీల్లో సింగిల్ కాలమ్ వార్తలకే పరిమితమవు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో 2020లో తొలి ఆరునెలల్లో రెండువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, వాటికి దక్కని ప్రాథాన్యత సినీ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు లభించిందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ మాజీ విగాధిపతి శ్రీమతి పద్మజా షా మాట్లాడుతూ విశ్వసనీయతను దృవీకరించుకోవడానికి ప్రింట్ మీడియాకు కొంత సమయం దొరుకుతుందనీ, ఎలక్ట్రానిక్ మీడియా సంచనాలు, టీఆర్పీ రేటింగ్స్ కోసం ఊహాగానాలతో తొలి కథనాలను వండి వారుస్తున్నారని విమర్శించారు. ఇలాంటి సమయంలో నైతిక విలువలను ఎలా ఆశిస్తామని ప్రశ్నించారు. ఈ తరహా విలువల పతనం ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ఉందన్నారు. అయితే సంచలనాల కోసం తాపత్రయపడే మీడియా సంస్థలను ప్రజలు ఏమాత్రం విశ్వసించరని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఎక్కువగా అవాస్తవాలే ప్రచారం అవుతున్నాయనీ, కానీ అప్పుడప్పుడు ప్రధాన మీడియా నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని కూడా ఇదే చేపడుతున్నదని గుర్తుచేశారు. కార్యక్రమానికి ఐజేయూ అధ్యక్షులు కే శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహించారు.