Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు రైతులకు పట్టాలివ్వాలి
- భూస్వాముల తీరుతోనే 4 తరాల రైతులకు అన్యాయం :
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్
- యాచారం తహసీల్ ఎదుట కౌలు రైతులతో ధర్నా
నవతెలంగాణ-యాచారం
నాలుగు తరాల నుంచి సాగు చేసుకుంటున్న రైతులందరికీ రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నాలుగు గ్రామాల రైతులు సింగారం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ సుచరితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. 1950 నుంచి రైతులందరికీ 37/ఆ చట్టం ప్రకారం పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. ఆనాడు కొంతమంది భూస్వాములు స్వార్థ బుద్ధితో సాగు రైతులకు భూములు చెందకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ పేరు రాశారని చెప్పారు. దాంతో నాలుగు గ్రామాల సాగు రైతులకు పట్టాలు రాలేవన్నారు. తక్షణమే కాస్తులో ఉన్న రైతు పేర్లను రికార్డుల్లో ఎక్కించాలని డిమాండ్ చేశారు.
అధికారులు రికార్డులో ఓంకారేశ్వర దేవదాయ శాఖ పేరును తొలగించాలని కోరారు. రైతులకు పట్టాలు లేక ప్రభుత్వం అందించే రైతు బంధు, రైతుబీమా రావడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవ తీసుకొని రైతులకు పట్టాలు వచ్చే విధంగా చూడాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్‌రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అలంపల్లి నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.అంజయ్య, ఐద్వా మండల కార్యదర్శి మస్కు అరుణ, నాలుగు గ్రామాల కౌలు రైతులు, తదితరులు పాల్గొన్నారు.