Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
- టీఎస్జీహెచ్ఎంఏ కార్యవర్గంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంఘటిత పోరాటం చేయడం ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) కార్యవర్గ సమావేశాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్ అధ్యక్షతన హైదరాబాద్లోని కూకట్పల్లిలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన నర్సిరెడ్డి మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పలుసార్లు వాటిని చేపడతామంటూ హామీనిచ్చారని గుర్తు చేశారు. అయినా కార్యరూపం దాల్చకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించామని టీఎస్జీహెచ్ఎంఏ అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సర్వీస్ నిబంధనలు ఏర్పరిచి, ఈనెలలోనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను చేపట్టాలనీ, ఇందుకోసం ప్రభుత్వం షెడ్యూల్ను విడుదల చేయాలని కోరారు. మధ్యాహ్న భోజనం నిర్వహణ బాధ్యత ప్రధానోపాధ్యాయులకు ఉండడం వల్ల బోధన కార్యక్రమాల పర్యవేక్షణలో ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. ఆ బాధ్యత నుంచి ప్రధానోపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. 317 జీవో ప్రధానోపాధ్యాయుల అప్పీళ్లను త్వరలో పరిష్కరించాలని పేర్కొన్నారు. జెడ్పీ జీపీఎఫ్, ఎస్ఎల్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలిపారు. ఎంఈవో పోస్టులను, అప్గ్రేడ్ చేసి, ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని సూచించారు. కాంప్లెక్స్ పాఠశాలలపైన ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల బిల్స్ భారం అదనంగా పెరిగినందున స్టేషనరీ తదితర ఖర్చుల కోసం అదనపు గ్రాంట్ ఇవ్వాలని పేర్కొన్నారు.